పుట:RangastalaSastramu.djvu/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాత్రపైకి మారుతూఉన్నా కేంద్రస్థానంలోఉన్న ముఖ్యపాత్రమీద కూడా ప్రసరించే అవకాశ మేర్పడుతుంది. అట్లా మధ్యలో ఉండటానికి వీలులేక, ముఖ్యపాత్రను వేరుచేసినప్పుడు సంభాషణలు చెప్పే పాత్రలు, ఆసమయంలో ప్రధాన పాత్రవైపు అప్పుడప్పుడు చూడడం, అంగవిన్యాసాలు చెయ్యడంద్వారా ఆ పాత్రపై ప్రేక్షకదృష్టి తగినట్లుగా కేంద్రీకరింపబడేవిధంగా దర్శకుడు శ్రద్ధ తీసుకోవలె.

గుంపులతోకూడిన నృత్యాలు

ముఖ్యపాత్రకు, గుంపుకు మధ్య సన్నివేశము నాటకంలో ఉన్నప్పుడు ముఖ్యపాత్ర రంగస్థలానికి ఒకవైపు, గుంపు మరొకవైపు ఉండేటట్లు సమీకరణ ఏర్పాటుచేయవలె. గుంపు ముందుగాగాని, లేదా రంగస్థలం దిగువవైపు (dons stage) స్థానాలలోగాని ఉండవలె. నాటకంలో ముఖ్యపాత్రధారిని గుంపు చుట్టుముట్టవలసి వచ్చినప్పుడు, ఆ ముక్యపాత్రధారి ప్రేక్షకులందరికి కనిపించేటట్లు బల్లమీదో, కుర్చీమీదో, వేదికమీదో ఉండేవిధంగా జాగ్రత్తపడవలె. గుంపుకు ప్రాముఖ్యములేక, అది కేవలము నాటకీయ వాతావరణసృష్టికి అవసరమయినప్పుడు, గుంపును రంగస్థలం ఎగువలో ఉంచి, పాత్రలను రంగస్థలం దిగువస్థానాలలో ఉండవలె. ఉన్నదానికన్న గుంపుసంఖ్య ఎక్కువగా కనిపించేటందుకు దిగువసూచనలు పాటించవలె.

1. ప్రేక్షకులకు సమీప్ంగా ఉండేవైపు, దిగువభాగం (down stage) లో నటులను ఖాళీలేకుండా వరసగా నిలుచుండబెట్త్తి, తక్కినవాళ్ళను వారివెనక అక్కడక్కడ నిలబెట్టవలె.

2. ప్రవేశద్వారాలదగ్గర కొంతమందిని నిలబెట్టడంవల్ల వాటిని దాటి కూడా సమూహము ఉన్నదనేభ్రాంతి మరింత పుష్టిపొందుతుంది. దీనికి సాయంగా గుంపును ఉద్దేశించి సంభాషణచెప్పే పాత్ర ప్రవేశద్వారాలవంక చూస్తూ సంభాషణలు చెబితే ఈ భ్రాంతి మరింత పుష్టిపోందుతుంది.

3. గుంపులో ఉన్నవారు, ఒకరినొకరు క్రమబద్ధంగా నిల్చొని ఖాళీలు ప్రేక్షకదృష్టికి రాకుండా జాగ్రత్తపడవలె.

4. కోట్లు, కండువాలు, తలపాగాలు మొదలైన ఖాదీదుస్తులు సమూహంలో ఉన్నవారు ధరిస్తే ఎక్కువమంది ఉన్నారనే భ్రాంతి తప్పక కలుగుతుంది.