నవి, దున్నేవావికే భూమె లని నినాదాలు బయలుదేరినవి. జమీందారు - రైతు పోరాటాలు ప్రారంభమైనాయి. తెలంగాణాలో భూస్యామ్య వ్యవస్థమీద పోరాటము ప్రారంభమైనది. ఆ యా భావాలను ప్రజలలోకి చొప్పించడానికి యువకులు నాటకాలు వ్రాయసాగినారు. దీనితో అభ్యుదయ నాటకసాహిత్యమనే పేరుతో కొత్తరకంనాటకాలు బయలుదేరాయి. సుంకర, వాసిరెడ్డి రచించిన 'ముందడుగు ', 'మాభూమి ' ఈ అభ్యుదయనాటకాలకు మచ్చుతునకలు. సుంకర, వాసిరెడ్డి - ఈ జంట రచయితల రచనలతో నాటకసాహిత్యంలో ఇంకో నూతనాధ్యాయము ప్రారంభమైంది. ఆ తరవాత కొండముది గోపాలరాయశర్మ, బోయిభీమన్న ప్రభృతులు ఈ రకం నాటకాలు రచించినారు. ఇవన్నీ వర్గపోరాటాన్ని చిత్రించే నాటకాలు.
ఆంధ్ర నాటక కళాపరిషత్తు 1944 లో నాటకపోటీల నిర్వహణ ప్రారంభించడంతో నాటకరచనలో పెద్ద మార్పు వచ్చినది. అయిదు సంవత్సరాల కిందట రచించిన నాటకాలు పోటీలకు అర్హమైనవి కావని నియమము పెట్టడంతో కొత్తనాటకాలు కోకొల్లలుగా వెలువడసాగినవి. స్త్రీ పాత్రలు స్త్రీలే నిర్వహించవలెనని నియమం పెట్టడంవల్ల స్త్రీ పాత్రల కొరతవల్ల స్త్రీ పాత్రలను తగ్గించికాని, లేదా అసలు స్త్రీ పాత్రలు లేకుండాగాని నాటకాలు వ్రాయడం మొదలు పెట్టినారు. హాస్య పాత్రలకు కూడ బహుమతి ఉండడంవల్ల సర్వసామాన్యంగా హాస్య పాత్రను నాటకాలలో ప్రవేశపెడుతున్నారు. రచనకుకూడ బహుమతి ఉండడంవల్ల రచయితలలో నూతనోత్సాహము రేకెత్తినది. కొత్త కొత్త పుంతలుతొక్కి నాటకాలలో తమ వ్యక్తిత్వము ప్రదర్శించవలెనని పట్టుదల బయలుదేరినది. ఈ పరిషత్తు పోటీలద్వారా గోపాలరాయశర్మ 'ఎదురీత,' ఆచార్య ఆత్రేయ 'ఈనాడు,' 'ఎన్.జి.వో ' నాటకాలు వెలుగులోకి వచ్చి ప్రజా హృదయాలను సాంఘిక నాటకాలవైపు బాగా ఆకర్షించినవి. ఆత్రేయ 'ఎన్.జి.వో ' తో తెలుగు నాటక సాహిత్యంలో ఇంకో నూతనాధ్యాయము ప్రారంభమైంది; రచయితల దృష్టి మధ్యతరగతి ప్రజానీకం జీవిత చిత్రణమీదకు మరలించి.
ద్వితీయ ప్రపంచసంగ్రామము ముగిసినా యుద్ధ మేఘాలు ఇంకా కమ్ముకొనే ఉన్నాయి. ఈ యుద్ధ మేఘాలను చెల్లాచెదరు చేయడానికి ప్రపంచమంతా శాంతి ఉద్యమము బయలుదేరింది. ఈ ఉద్యమప్రభావంతో వచ్చిన