పుట:RangastalaSastramu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 తెలుగు నాటక సంక్షిప్త చరిత్ర


సంస్కృతాలంకారికులు సాహిత్యప్రక్రియలలో నాటకానికి ప్రాధాన్యమిచ్చినా, పూర్వాంధ్ర కవులెవ్వరూ తెలుగులో నాటకాలు రచించడానికి పూనుకోలేదు. ఇందుకు పలువురు విమర్శకులు పలుకారణాలు చెబుతున్నారు. అసలు మార్గనాటకాలకు అనువైన నాటకశాలలు, నాటకరంగము లేకపోవడంవల్ల, రాజాభిమానము లేకపోవడంవల్ల, సంఘంలో నటీనటులకు గౌరవంలేకపోగా వారిని పంక్తిబాహ్యులుగా పరిగణించడంవల్ల, సంస్కృత నాటకలక్షణానుసారము పాత్రోచిత భాషాప్రయోగంలో భాగంగా గ్రామ్య, వ్యవహారభాషలు ప్రవేశపెట్టడం ఇష్టములేకపోవడంవల్ల, పూర్వపు తెలుగుకవులు నాటకాలు రచించడానికి సాహసించలేదని మన విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కారణమేమైనా పూర్వము తెలుగు నాటకాలు వెలువడలేదనడం యధార్ధము.

అయితే ఈ అంధకారాన్ని చీల్చుకొని ఎట్లాగో 15 వ శతాబ్ధంలో క్రీడాభిరామము అనే రూపకము వెలువడించి. కాని ఇది పూర్తిగ స్వతంత్రమూకాదు, రూపకరూపంలోనూలేదు. సంస్కృతంలోని "ప్రేమాభిరామము" అనే రూపకానికి ఇది తెలుగు అనుసరణ. ఇది సంస్కృత దశరూపకాలలోని వీ రూపకశాఖకు చెందినది. దీనిని రచించినది వల్లభరాయుడని కొందరు, శ్రీనాధుడే రచించి వల్లభరాయనిపేరు పెట్టినాడని కొందరు భావిస్తున్నారు. ఎమైనా క్రీడాభిరామము తెలుగుభాషలోని ప్రప్రథమరూపక మనడంలో సందేహములేదు.

"నటులది దోర సముద్రము
విటులది యోర్లల్లు కవిది వినుకొండ మహా
పుట భేదన మీత్రితయము
నిటగూర్చెను బ్రహ్మ రసికులెల్లరుమెచ్చన్"

అని క్రీడాభిరామంలో రచయిత చెప్పడంవల్ల ఈ రూపకాన్ని ప్రదర్శించేవారని తెలుస్తున్నది. ఇందులో రెండే పాత్రలు. ఒకరోజే కధాకాలము; పాత్రలిద్దరు వేకువజామున ఓరుగల్లు ప్రవేశించినది మొదలు, తిరిగి అర్ధరాత్రివరకు జరిగినకధ