పుట:Ranganatha Ramayanamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంగదాదులు మధువనంబునకు వచ్చుట

"మన మింక సుగ్రీవు మధువనంబునకు - నెనసినకడఁకతో నేగి యందఱము1000
తనివోవఁ దేనియ ల్ద్రావక యున్న- మనదప్పి పో" దని మది విచారించి
యినకులాధిపుపను లెల్ల సాధించి - చనియెద మటుగాన జలజాప్తసుతుఁడు
మనమీఁదఁ గోపించి మర్దింప వెఱచు - నని నిశ్చయముఁ జేసి యందఱుఁ గూడి
హనుమంతు నంగదు నపుడు ప్రార్థించి - యనుకూలముగ వారి యనుమతి వడసి
యాతతబలులు మధ్యాహ్నంబు కొలఁది - నేతెంచి మధువనం బేపుమైఁ జొచ్చి
దిక్కుల వెదచల్లు తేనెతావులకు - గ్రుక్కిళ్ళు మ్రింగుచు గునిసి యాడుచును
గొనచెవు ల్నిక్కించి కొక్కరింపుచును - గినిసి యొండొరులఁ దర్కింపుచు వేడ్క
నెనయంగ దమతమ కిష్టంబులైన - వనభూములకు వారి వనచరాధిపులు
దీనిధు ల్మఱి పువ్వుతేనియ ల్జుంటి - తేనియలును బుట్టతేనెలు నైన
పలుతేనె లొగి ద్రావి ఫలములు నమలి - కలయఁ బువ్వులు రాల్చి కాయలు డుల్చి1010
తలిరుకొమ్మలు ద్రుంచి తరుకోటి వంచి - మలయుచు గొమ్మకొమ్మకు సూటి దాఁటి
యొలసి పూఁదీగెల నుయ్యెల లూఁగి - కొలఁకులఁ గ్రీడించి గూడి వర్తింప
నాలోన దధిముఖుఁ డనఁగ నావనము - పాలింపుచుండెడి ప్లవగుఁ డొక్కరుఁడు
అసమానకోపుఁడై యందఱఁ గినిసి - వెసఁ దమ్ము భర్జించి వెడలిపొ మ్మనుచు
వనపాలకులచేత వరుసఁ ద్రోయింప - వనచరు ల్వెసఁబాఱి వారి వారించి
వడి నంగదుండును వాయునందనుఁడు - తడయక దధిముఖు ధరణిపై లీల
గెడపి పెట్టుక మోము క్రిందుగా నీడ్చి - పొడిచి త్రోచుటయును బొలుపూది వాఁడు
కోపించి మొఱపెట్టుకొనుచును బోయి - యాపద్మహితసూను నడుగుల కెఱఁగి
"దేవదానవులకు దృష్టింపరాని - దేవ! నీవన మెల్లఁ దేజంబు మెఱసి
పెనఁగొని వనచరు ల్పెక్కండ్రతోడఁ - జనుదెంచి యసమానసత్వులై కూడి1020
యామరుత్తనయుండు నావాలిసుతుఁడు - నీమధువనములోనికి నేగుదెంచి
తగిలి మ్రాఁకులు ప్రాఁకి తరుశాఖ లలమి - తిగిచి పండులు తిని తేనియ ల్గ్రోలి
యిది రాజవన మని యిచ్చ భీతిలక - కుదియక యంతఁ గైకొనకున్నఁ జూచి
యెడపక జంకించి యేను మీయాన - బొడిచి తోచుటయును బొడిచిరి నన్ను”
నని వాఁడు మొఱ యిడ నలిగి సుగ్రీవుఁ - డెనసి మర్దింప నూహించినఁ జూచి
యంత నావృత్తాంతమంతయు నెఱిఁగి - సంతతజయశాలి సౌమిత్రి పలికెఁ.
“దొలఁగక యంగదాదులు మహాకపులు - నెలకొని సుగ్రీవ! నీయాక వనము
తలఁక కింతయు లేక తమయంతఁ జొచ్చి - నలి తేనెఁ ద్రావుచున్నా రేని? వినుము.
ఆతతబలసత్వు లగువారిచేత - సీతాధిపతిపను ల్సిద్ధింప నోపుఁ
గాకున్న నీయాజ్ఞ గడవ నోపుదురె - గైకొని పిలిపింపు కడఁకతో వారి”1030
నని బుద్ధి సెప్పిన నర్కనందనుఁడు - తనబుద్ధి గైకొని దధిముఖుఁ జూచి
శ్రీరాముకార్యంబు చేసిరి గాన - వారిచేసినసేఁత వారికిఁ జెల్లె
నూరక యీశోక ముడిగి నీ వింక - వారిఁ బుత్తె"మ్మన వాఁ డంత నరిగి
హనుమంతు నంగదు నాజాంబవంతుఁ - గని మ్రొక్కి “నాతప్పు గాచి మన్నించి