పుట:Ranganatha Ramayanamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“యిదె పోయి తెచ్చెద నినకులేశ్వరుని - మదిలోన నీకు నుమ్మలికంబు వలదు”
అని “యింకఁ బనివిందు" ననుచు సీతకును - వినయంబుతో మ్రొక్కి వీడ్కొని కదలి
తడయక పశ్చిమద్వారంబునందు - వెడలుచు పావని వెస నేపు మిగిలి
తలుపులు పడఁదన్నఁ దలుపులు విఱిగి - యిలఁ గూలె రాక్షసు లెల్ల భీతిల్ల
నురవడి నాలుక యొకటఁ గంపింపఁ - బరవసంబునఁ బేర్చి పదిలుఁడై వెడలి
వరుసతో నట్టళ్ళు వడిఁ గూలఁ దన్ని - యలరి సువేలాద్రి నవలీల నెక్కి
కలయ లంకాపురిఁ గల దైత్యు లెల్ల - బెలుకురి భీతిల్ల బెల్లార్చి యార్చి970
కడఁగి పానుపులు భగ్నంబులై యబ్ధి - చెడి కూల వడి మహాశిల లెల్ల డుల్ల
నంగద మైఁ బెంచి యద్రిశృంగములు - క్రుంగి కుంభినిఁ గ్రుంగఁ గుప్పించి దాఁటి
యటు దాఁటి బలువిడి యాకాశవీథిఁ - బటుసత్వదేహసంపద వచ్చి వచ్చి
యరుదైన పేరితో నబ్ధిమధ్యమునఁ - బరఁగు మైనాకుఁ డన్ పర్వతాధీశుఁ
గని, యందుఁ దనమేనఁ గల దప్పిఁ దీర్చు - కొని పర్వతుని వీడుకొని యట వచ్చి
పొలుపొందు తనజవంబును పెంపుసొంపు - తలకొని జలధియుత్తరతీరభూమి
నతిసత్త్వసంపన్నుఁ డై వచ్చి నిలువ - నతనిసంతోషచిహ్నము లెల్లఁ జూచి
యంగదుఁ డాదిగా నగచరాధిపులు - సంగతి నెదురుగాఁ జని కౌఁగిలించి,
ప్రకటించి యందంద పరిణామ మరసి - యొకచోట నందఱు నోలిఁ గూర్చుండి,
పోయిన కార్యంబు పొలుపొంద నడుగ - నాయున్నతోన్నతుం డందఱఁ జూచి980
“కపులార యేను మీకరుణమైఁ జేసి - యుపమింప నరుదైన యుదధి లంఘించి
యగణితవైభవం బగులంకఁ జొచ్చి - తగిలి శోధించి సీతాదేవిఁ గాంచి
యినకులాధిపుఁ డానతిచ్చినత్రోవ - జనకనందనతోడ సకలంబుఁ జెప్పి
యింతికి ముద్రిక నిరవంద నిచ్చి - యింతిశిరోమణి యిదె పుచ్చుకొనుచు
వచ్చితి నే" నన్న వనచరాధిపులు - నిచ్చలో హర్షించి యింపు సొంపొంది
హనుమంతు నందఱు నన్నిచందముల - గొనియాడి కొనియాడి గోర్కులఁ దేలి
యున్నచో నంగదుఁ డురుపరాక్రముఁడు - క్రన్నన నుత్సాహకలితుఁడై పలికె.
“జనకజ మన మింక సాధించి తోడు - కొనిపోయి రఘురాముఁ గూర్చుట లెస్స
యటు గాన నిప్పు డీయంబుధి దాఁటి - పటుపరాక్రముఁ డైన పఙ్క్తికంధరుఁడు
సుతులతో హితులతోఁ జుట్టాలతోడ - నతిరయంబునఁ జంపి యవనిజఁ గొనుచు990
వత్తము లెం"డను వాలిసూనునకుఁ - నత్తఱి ఋక్షేశుఁ డనియె భావించి,
“మనల సుగ్రీవుండు మైథిలి వెదుకఁ - బనిచినపనులెల్లఁ బావనివలన
ననఘాత్మ! సఫలంబు లయ్యె నీమీఁద - నినకులాధిపునితో నీవార్తఁ జెప్పఁ
బోవుట తగు" నన్నబుద్ధి నొండొరులు - భావించి దాని కేర్పడ సమ్మతించి
వనచరు ల్నాఁ డెల్ల వనధితీరమున - ననిలసూనుఁడు దాము నర్థితో నుండి
బహుమూలఫలములఁ బరితృప్తి బొంది - మహితసత్త్వాదికు ల్మఱునాఁడు కదలి
ధరణిపై మేరుమందరములకంటెఁ - బరపైన దర్దరపర్వతంబునకు
జనుదెంచి యగ్గిరిసానుదేశముల - వనమూలఫలములు వడి నాస్వదించి
యాయద్రిపతిమీఁద నారాత్రి నిలచి - యాయతభుజబలు లంత వేగుటయు