పుట:Ranganatha Ramayanamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనచరోత్తములార! వడి నేగుఁ డింక - వనములోపల నుండ వలవదు మీరు
మిమ్ము బుత్తెమ్మని మిహిరనందనుఁడు - నిమ్ముల నా కాన తిచ్చి పుత్తెంచె"
ననువార్తఁ జెప్పిన నందఱు నుబ్బి - యినసూనునాజ్ఞకై యెదకొన్నవాలి
తనయుని నూరార్చి తడయక పేర్చి - వనచరాధీశులు వనభూమి వెడలి
యుప్పొంగుకడకల నుప్పురం బెగసి - యప్పుడు మేఘంబులట్ల మ్రోయుచును
వారక చనుదెంచువారిచిహ్నములు - దూరంబులందు సంతోషించి చూచి1040
యినజుండు కపిసేన నెదురుగాఁ బంచి - యనురక్తి రప్పింప నర్ధితో వచ్చి
జగదీశుఁ డగు రామచంద్రునంఘ్రులకు - నగచరు ల్దండప్రణామము ల్చేసి
తదనంతరంబునఁ దగ లక్ష్మణునకుఁ - బిదప నర్కజునకుఁ బ్రీతితో మ్రొక్కి,

హనుమంతుఁడు సీతను చూచిన తెఱం గెఱింగించుట

యందఱుఁ గొనివచ్చి హనుమంతు నపుడు - ముందఱ నిడికొని ముదము దీపింప
శ్రీరామచంద్రుని సింహాసనంబు - చేరువ నోలి యాసీనులై యుండ
వలనొప్పఁ దమపోయి వచ్చిన తెఱఁగుఁ - దలకొని వినఁగోరు ధరణీశుతలఁపు
హనుమంతుఁ డెంతయు నాత్మలో నెఱిఁగి - ఘనమైనభక్తితోఁ గరములు మొగిచి
“కమలాప్తకులనాథ! కంటి వైదేహి - ప్రమదాశిరోమణిఁ బరమకల్యాణి
ధరణీశ! మీయాజ్ఞ తల మోచికొనుచు - నరుదైనదేశంబు లన్నియు వెదకి
చిరభక్తి సంపాతిచేఁ ద్రోవ యెఱిఁగి - యరిగి సముద్ర మే నవలీల దాఁటి1050
యొనర దక్షిణదేశమున మహామహిమఁ - దనరు త్రికూటాద్రిఁ దద్దయు నొప్పి
దానవకులపాలితం బైనలంక - యే నొక్కరుఁడ చొచ్చి యెల్లచో వెదకి
ధరణిజఁ గానక తద్దయు వగచి - యరిగి రావణుని యుద్యానంబు గాంచి
పరికించి రాక్షసభామలు దన్ను - తిరిగి చుట్టుచునుండ దేవ మీదేవి
యుపవాసముల డస్సి యొకమానిక్రింద - విపులదుఃఖంబులవెల్లిలో మునిఁగి
చెక్కిటఁ జెయ్యూది చిత్తంబు చూపు - నెక్కొన్నవగలతో నీయందె చేర్చి
దనుజుండు చనుదెంచి తనుఁ దెచ్చుతెఱఁగు - తనదిక్కులేమికిఁ దలపోసి చూచి
యుడుగనికన్నీరు లున్నంత ప్రొద్దుఁ - బడియునిట్టూర్పులు వడిఁ బుచ్చిపుచ్చి
మాసినచీరతో మఱి యైనధూళి - ధూసరితాంగియై తూలికై వ్రాలి
తలయూచి తలయూచి తలకొన్న వగలఁ - బలుమాఱు వేగుచుఁ బలవింపఁ జూచి1060
మీనాక్షిచిహ్నము ల్మీరు నాతోడ - నానతిచ్చినత్రోవ లన్నియుఁ జూచి
క్రమమున మరి సీతగా నిశ్చయించి - కమలాక్షిఁ బిదప దగ్గఱఁ బోయి మ్రొక్కి
తామరసాక్షితోఁ దగుమాటలాడి - లేమకు మీయంగుళీయక మిచ్చి
మగుడ శిరోమణి మఱిఁ బుచ్చుకొనుచు - మగుడక యారామ మంతయుఁ బెఱికి
కమలాకరంబులఁ గలఁచి ని న్దలఁచి - కమలాప్తసుతునాజ్ఞఁ గడుమది నెంచి
కరిబృందములఁ బట్టి కలఁచుసింహంబు - తరి వనపాలకతతి రూపుమాపి
తరమిడి తమతండ్రి తలఁపు దీపింప - నరుదెంచినట్టి యాయక్షయుఁ ద్రుంచి
చెలఁగి రాక్షసవీరసేనలఁ జంపి - యల యింద్రజిత్తుతో నచటఁ బోరాడి