పుట:Ranganatha Ramayanamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరశురాములఁ బట్టి భంజించి విడిచి - ఖరదూషణాదుల ఖండించె మఱియు
నీపెంపు గుదియించి నినుఁ దోఁకఁ గట్టి - యేపున ని న్నబ్ధి నీడ్చిన వాలిఁ
బొలుపార నొకబాణమునఁ గూలనేసి - బలియుఁడై సుగ్రీవుఁ బట్టంబు గట్టి840
యక్షీణశక్తిమై నతులకోదండ - దీక్షాగురుండనఁ దేజంబు మెఱసి
తగిలి రాక్షసకులాంతకుఁ డైనరామ - జగతీశునిజదూత చతురమానసుఁడ;
హనుమంతుఁ డనువాఁడ నర్కజుమంత్రి - నినవంశనిధి రాముఁ డిట నన్నుఁ బనుప
ముద మొప్పఁ బ్రతివ్రేలిముద్రిక గొనుచు - నొదవినకడిమిమై నుదధి లంఘించి
వచ్చి నీపురిఁ జొచ్చి వైదేహి నరయ - నెచ్చటఁ బొడగాన కెంతయుఁ బోక
యవనిజ వనములో నారసి కాంచి - యవనీశుఁ డిచ్చిన యానవా లిచ్చి
దేవి నీపురి నున్కి తెఱఁగొప్పరామ - భూవరునకుఁ జెప్పఁబోవుచు నుండి
యెనసి నారాక నీ కెఱిఁగింపఁ గోరి - పెనిచినవన మెల్లఁ బెఱికి పో వైచి
వనపాలు రగుదైత్యవరులఁ గింకరుల - నెనుబదివేపుర నేపుమైఁ గడఁగి
మడియించి మునుమిడిమంత్రినందనుల - మడియించి యక్షుని మడియించి పిదపఁ850
దగిలి నీయున్నచందము లెల్లఁ జూచి - మగిడి పోయెద నని మఱి పట్టుపడితి
నారామునిజభృత్యుఁ డైనసుగ్రీవు - భూరిసైన్యములలోఁ బొలుపు దీపింప
నలవుమై నాకంటె నతిబలాధికులు - కొలఁది బెట్టఁగరాని కోటు లున్నారు;
అదిమి బ్రహ్మాదుల నైన సాధించు - మదయుతు ల్నీవన్న మండుచుండుదురు;
గొనకొని యావీరకోటులతోడ - వననిధి బంధించి వచ్చి రాఘవుఁడు
లంకపై విడిసి చలంబు పెంపెక్కి - కిన్కమై నసురులగీ టణంగించి
నీతల ల్నుగ్గాడి నిను సంహరించి - సీతఁ దోడ్కొనిపోవు సిద్ధ మీపలుకు;
నెలకొని నీ వింక నీతిమార్గమునఁ - దొలఁగక బుద్ధిమంతుఁడ వైన వినుము.
సీత నొప్పించి యాశ్రితలోకపారి - జాతంబు రఘురాము శరణంబుఁ జొరుము
వలవదు వైరంబు వసుధేశుచేతఁ - బొలియక నీప్రాణములు గాచికొనుము"860
అని బుద్ధి చెప్పిన హనుమంతుఁ జూచి - కనలుచుఁ బెంపుమొక్కలమును గదుర
ఘనఘనాఘన మేఁచి గర్జించినట్లు - తనియక భర్జించి దశకంఠుఁ డలిగి
"వెఱవక చను దెంచి వీఁడు నాయెదుట - నఱుగమి దుర్భాష లాడుచున్నాఁడు
కొనిపోయి చంపుఁ డీకోఁతికీటంబు" - నని ప్రహస్తుని బంప నసురేశుఁ జూచి
వినయభాషణుఁడు వివేకభూషణుఁడు - ననఘపోషణుఁడు మత్తారిభీషణుఁడు
నావిభీషణుఁడు కార్యము దీర్ఘచింత - భావించి చూచి యేర్పడ విన్నవించె;
"మగువల బ్రాహ్మల మఱి బాలకులను - దగదు దూతలఁ జంప దనుజాధినాథ!
వలనొప్పఁ బతిపను ల్వచ్చినదూత - లలవుమై నే మైన నాడుచుండుదురు;
అది దూతలకు ధర్మ మది విచారించి - మదిలోనఁ గోపంబు మట్టు గావింపు;