పుట:Ranganatha Ramayanamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తుద దూత లెందు వధ్యులు గారు గానఁ - బొదివి యీకోఁతిఁ జంపుట పాటిగాదు870
చలము కోపము రామసౌమిత్రులందు - వెలువరింపుము వీని విడిచి పోనిమ్ము;
మగుడక కిన్క నీమది నుండునేని - దగినదండము కొంత దండించి పుచ్చు"
మని నీతి చెప్పిన నతనివాక్యములు - విని రావణుఁడు దైత్యవీరులఁ జూచి
కోతుల కెల్లను గుఱుతు వాలంబు - బ్రాతిగా నటుగానఁ బ్రజలెల్లఁ జూడ
వీనివాలము గాల్చి వీథులఁ ద్రిప్పి - పోనిండు నావుడుఁ బొదివి రక్కసులు
బలుమోకు లోగి దెచ్చి పవనజుఁ గట్టి - బలిమి చేతులు కాళ్ళు బంధించి తెచ్చి
మనవారి పెక్కండ్ర మడియించినట్టి - చెనఁటికీటము లెస్స చిక్కెరా యనుచు
బురవీథులందుఁ ద్రిప్పుచు నంతకంత - వరుసతూర్యంబులు వాయించికొనుచు
నెల్లెందు మెలఁగ నయ్యెడ వాయుసుతుఁడు - కల్లరిదనుజుల కలయఁ గ్రేఁగంట
గనుఁగొంచు మఱియు లంకాపురం బెల్లఁ - గనుఁగొనుతలఁపున గాసికి నోర్చి880
హీనసత్త్వుఁడు పోలె నిటునటు దిరుగ - నానావిధంబుల నగుచు రేఁగుచును,
ఆబాలగోపాల మతని వెన్ దగుల - నాబూమెలకుఁ బుణ్యు లాత్మలో వగవఁ
దలకొని యెంతయు దైతేయవరులు - చలమునఁ జీర లసంఖ్యము లెచ్చి
కాలసర్పాకృతు ల్గా తిరు ల్దాల్చి - లోలత నవి నూనెలోఁ దోఁచి తోఁచి
యిది యశోకారామ మెల్ల ఖండించె - నిది దానవేంద్రుల నెందఱఁ జంపె
దీనికిఁ దగుశిక్ష దేవారి పెట్టె - దీని గాల్పుఁ డటంచుఁ దెగువ నొండొరులు
నొదవిన లంకలో నుత్పాతహేతు - వుదయించె నని పేర్చుచున్నవాలమున
నచ్చలంబునఁ జీర లన్నియుఁ జుట్టి - చిచ్చుఁ దగిల్చి రచ్చెరువుగా మండ
దనుజులు సింహనాదములు సేయుచును - వెనువెంటఁ దగుల నావృత్తాంత మెల్ల
తప్పక దనుజకాంతలు చూచి పోయి - చెప్పిన నప్పుడు సీత శోకించి,890
“యక్కటా! నీతిజ్ఞుఁ డైన నీ కిట్టి - యిక్కుపాటును గల్గెనే? తండ్రి!" యనుచు
జలములు దడవి సుస్థలమున నిల్చి - చెలువొప్ప నగ్నికిఁ జేతులు మొగిచి
"యారామవిభుఁడు ధర్మాత్ముఁ డౌనేని? - వారిధి నాకుఁగా వడి దాఁటునేని
యీరావణుని రాముఁ డిలఁ గూల్చునేని? - వారక నేపతివ్రత నౌదు నేని?
జనకభూపతి సర్వసముఁ డగునేనిఁ? - దనరువేదములు సత్యము లగునేని?
పవమానమిత్ర! యోపరమపవిత్ర! - నవకేకిశరద! దోషాభోజద్విరద!
వరద! వైశ్వానర! వానరోత్తముని - పరమశీతలుఁడవై పాలింపవయ్య!"
యని సీత ప్రార్థింప ననిలసూనునకు - ఘనవాల మనుపేరి కాలాహితలను
గనుపట్టు మాణిక్యకళికన మెఱసి - యనలుండు కడుఁజల్ల నై యుండె నంత.
ఆవిధంబునకుఁ దా నాశ్చర్య మంది - పావని తమతండ్రి పావకసఖుఁడు900
గావున న న్నగ్ని కరుణించె నొక్కొ? - దేవత లెల్లఁ బ్రార్థించిరో? రామ