పుట:Ranganatha Ramayanamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జేసినఁ గని యింద్రజిత్తుపై నలిగి - యాసమీరాత్మజుం డవలీలఁ దన్ని
మొనయుచు రథరథ్యముల నుగ్గు సేయ - ననిమొన విరథుఁడై యాయింద్రజిత్తు
హనుమంతుకడిమికి నచ్చెరు వంది - వినుతోగ్రబలవాయువీర్యాస్త్ర మేయ
వాయుపుత్రుఁడుగాన వానరాధీశుఁ - డాయస్త్రమునఁ దూల కచలుఁడై యున్న810
నరు దైన రౌద్రాస్త్ర మతనిపై నేయ - పెరిగి యాతఁడు రుద్రబీజంబు గానఁ
గదలక నిలిచినఁ గని యింద్రజిత్తు - మదిలోనఁ గోపించి మారుతిమీఁద
సురసిద్ధసాధ్యులు చూచి నిందింపఁ - బరమదుర్జయమైన బ్రహ్మాస్త్ర మేయ
నాయస్త్రరాజంబు నవనియు మిన్ను - రాయుచుఁ దనమీఁద రా వాయుసుతుఁడు
బ్రహ్మాస్త్రమునఁ బ్రాణభయము లేకుండ - బ్రహ్మచే వరములు పడయుటఁ జేసి
బలువిడిఁ బఱతెంచు బ్రహ్మాస్త్రమునకు - దలఁకక బ్రహ్మమంత్రము లుచ్చరింప
నది చంపఁజాలక యతని బంధించి - కుదియించి పడవైచెఁ గుంభినిమీఁదఁ
బడిన మారుతిఁ జూచి పట్టుఁడు కట్టుఁ - డడవుఁడు పొడుఁ డంచు నఖిలరాక్షసులు
సుట్టు ముట్టి కఠోరసూత్రజాలములఁ - గట్టిగాఁ గట్టిరి కట్టల్క నిగుడ
నంత నాహనుమంతుఁ డవశుఁ డై యున్న - నెంతయు రయమున నింద్రారిఁ జేరి820
నలువబాణంబుచే నాశంబు కాక - బలియుఁడై యటు పట్టువడియున్నయపుడె
"యెనయ నీవానరుం డెవ్వఁడో వీని - ననిమొనఁ జంపరా” దని నిశ్చయించి
అమితసత్త్వోన్నతుఁ డై పట్టి తెచ్చి - తమతండ్రిముందఱఁ దడయక పెట్టఁ
దనమంత్రివరులును దాను వేర్వేఱఁ - దనయులావునకుఁ దద్దయు సంతసించి
కనుఁగవఁ బ్రళయాగ్నికణములు దొరుగ - హనుమంతుఁ జూచి యిట్లనియె రావణుఁడు
"ఓరి వానరుఁడ! నాయున్నపట్టణము - శూరత నొంటిమైఁ జొచ్చుట యెట్లు
నీ వెవ్వఁడవు? మఱి నీకుఁ బే రేమి? - యేవెరవున వచ్చి తీవార్ధి దాఁటి?
హరుఁడు పంచినవాఁడొ? హరి పంచినాఁడొ? - పరమేష్ఠి ని న్నిటఁ బంచినవాఁడొ?
సురగరుడోరగాసురవియచ్చరులు - నరసిద్ధసాధ్యులు నాపేరు విన్న
వెఱతురు; నీ విట్లు వెఱవక వచ్చి - తెఱఁగంటిదొరకైన దృష్టింప రాక830
వఱలెడు నాపురి వంచనఁ జొచ్చి - పెఱికితి వనమెల్ల; బీఱంబు మెఱసి
బడుగురక్కసుల దుర్బలులఁ గొందఱిని - మడియించితివి మేటిమగవాఁడవోలె;
నిప్పు డీనేరంబు లిన్నియుఁ గాతుఁ - దప్పక నీరాక తగఁ జెప్పితేని?”
యనిన నాహనుమంతుఁ డద్దశకంఠుఁ - గనుఁగొని యెంతయుఁ గనలి యిట్లనియె.

హనుమంతుఁడు రావణునితో తనరాక యెఱింగించుట

"నోరి రాక్షస! విన రోరి నీచాత్మ! - దూరీకృతాచార! దుష్టమానసుఁడ!
విశదకీర్తులు మున్ను విశ్వంబు నిండ - దశరథేశ్వరునకుఁ దనయుఁడై పుట్టి
యరిగి విశ్వామిత్రుయాగంబు గాచి - హరువిల్లు విఱచి మహాశక్తి మెఱసి