పుట:Ranganatha Ramayanamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొలిసిరి వనపాలపుంగవు ల్గింక - రులు గీటణంగి రారూఢవిక్రములు
శతజిహ్వుఁడును గూలె శార్దూలముఖుఁడు - గతజీవుఁ డయ్యెఁ బింగళనేత్రుఁ డీల్గె
స్తనితహస్తుఁడు చచ్చె శార్దూలకబళుఁ - డనిఁ ద్రుంగె మృతుఁ డయ్యె నట జంబుమాలి
సోమించి వక్రనాసుఁడు మ్రగ్గె రక్త - రోముండు లయ మయ్యె రుధిరాక్షుఁ డణఁగె
దళములతో శూలదంష్ట్రుఁడు మడిసెఁ - జెలువేది మది దీర్ఘజిహ్వుండు దెగియె780
రూపఱిపోయె దుర్ముఖుఁడు దుర్ధరుఁడు - ప్రాపించె మరణంబు ప్రఘసుఁడు పడియె
నుఱుమయ్యె భాసకర్ణుండు యూపాక్షుఁ - డొరిగె విరూపాక్షుఁ డుసురుతోఁ బాసె
నక్షుండు దెగటారె హతుఁడయ్యె నశ్మ - వక్షుండు మడిసె దుర్వారసైన్యములు
ఇంక నావానరు నింద్రాదిసురలు - శంకింప కనిమొన సాధింపలేరు
ప్రళయాంతకుని నైనఁ బట్టి నిర్జింపఁ - జల మెక్కి యసమానసత్త్వుఁ డైనాఁడు"
నావుడు వెఱఁగంది నాకారి వగల -భావించి యక్షునిఁ బలవింపఁ దొడఁగె
“హా కుమారక! యక్ష! హా వీరవర్య! - హా! కపిచే నీవు నణఁగితే?" యనుచుఁ
దలఁకుచుఁ బలవించు తండ్రిని జూచి - తొలఁగక యింద్రజిత్తుఁడు చేరి పలికె

ఇంద్రజిత్తు తండ్రి నూరార్చి హనుమంతునిపైకిఁ బోవుట

"దేవ! నీ కేటికి ధృతి దూలి వగవ నావానరాధము నవలీలఁ దాఁకి
వారక యటఁ జంపి వచ్చెద నొండె? - ధీరత నిటఁ బట్టి తెచ్చెద నొండె?"790
నా విని తనయగ్రనందనుఁ జూచి - రావణుఁ డనియె ధైర్యస్ఫూర్తి నిగుడ
"జిరకాల మమరేంద్రు చెఱఁబెట్టినావు - పరమమాయారణప్రౌఢుండ వీవు
నాకంటె విక్రమోన్నతి మించినావు? - నీ కెదు రెవ్వరు నిఖిలలోకముల?
నసమున నటులయ్యు నావానరేంద్రు - నసదుగా వదలక యాత్మ నేమఱక
బహుదివ్యబాణప్రభావముల్ చూపి - సహజశౌర్యంబున జయముఁ గైగొనుము"
అనఁ దండ్రి వీడ్కొని యామేఘనాదుఁ - డనలార్కసంకాశ మగురథం బెక్కి
యగణితనిజధనుర్జ్యాఘోషమునకుఁ - బొగిలి దిగ్గజకర్ణపుటములు పగుల
జగములు బెదర దిక్చక్రబంధములు - పగుల నార్చుచు వచ్చి పవనజుఁ దాఁక
నాసమయంబున నమరులు మునులు - వాసవప్రముఖదిగ్వరులు కిన్నరులు
నుప్పరంబుననుండి యొదిగి వీక్షింప - నప్పంక్తికందరు నగ్రనందనుఁడు800
నడరి యాతనిదేహ మణుమాత్రమైనఁ - బొడవడకుండ నద్భుతశితాస్త్రములు
గురియ నయ్యస్త్రము ల్ఘోరవాలమునఁ - దరమిడి చదియుచుఁ దప్పించుకొనుచు
శరవేగలక్ష్యగోచరుఁడు గా కిట్లు - దుర మొనరించె నద్భుతపౌరుషమున
రావణి నిర్జితైరావణి యంతఁ - బావని యసమానబలవేగమునకు
నరు దంది మఱియు దివ్యాస్త్రంబు లేయఁ - బరువడి ఖండించి పవనజుఁ డతనిఁ
దరుశైలముల వైవ దర్పించి యతఁడు - శరముల నాటి జర్జరితము ల్సేసెఁ.