పుట:Ranganatha Ramayanamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నక్షీణదోస్సారు నసహాయశూరు - నక్షకుమారు మహావీరుఁ జూచి
““యలపుమై నాకోఁతి ననిలోనఁ జంపి - తలగోసి తోరణస్తంభంబునందుఁ
గట్టి ర” మ్మనవుడు గడఁకతో నతఁడు - నెట్టన శస్త్రాస్త్రనిచయంబుతోడఁ
దురగాష్టకముతోడ ధ్రువగతితోడ - బిరుదుటెక్కెముతోడ బృథుకాంతిఁ బొదలి
యుదయార్కనిభ మైన యొకరథం బెక్కి - కదలి భూభాగంబు గంపింప నడచె
నరదంబుమోతయు హయహేషితములు - కరిబృంహితములు రక్కసులయార్పులును
దనమహాకార్ముకధ్వనియు నొండొండ - ఘనములై యాశావకాశము ల్నిండఁ750
దోరణారూఢుఁడై తొలఁగక చెలఁగు - మారుతి నక్షకుమారుండు దాఁకి
త్రిజగము ల్భీతిల్ల దిశలు ఘూర్ణిల్ల - భుజశక్తి పుంఖానుపుంఖంబు గాఁగ
ఘనబాణతతుల నక్కజముగాఁ బొదువ - ననిమొన మఱి బాలుఁ డని యెంచరాదు
ఘనపరాక్రనుకళాఖని వీఁ డటంచు - హనుమంతుఁ డచలుఁడై యాబాణతతుల
వాలముఖంబున వడిఁ ద్రుంచివైవ - మే లని హనుమంతు మెచ్చుచు వాఁడు
బాణత్ర యంబునఁ బావనిశిరము - శోణితంబులు గార సూటి నేయుటయు
కీలాలధారలు కిరణము ల్గాఁగ - బాలభానుఁడు వోలెఁ బరఁగఁ జూపట్టి
యాలోనఁ బ్రళయకాలాగ్నియై మండి - తాలవృక్షమున రథ్యములు ద్రుంచుటయు
నేల పదాతియై నిలిచి వాఁ డతని - ఫాలంబు శరములఁ బదియింట నొంపఁ
నవశుఁడై తెప్పిరి యతఁడు వాలమునఁ - దవిలించి యక్షుని తనువు నొప్పింప760
నక్షుండు గదగొని యనిలతనూజు - వక్షంబు వ్రేసిన వడిఁ దూలి తెలిసి
కదిసి యగ్గదఁ బుచ్చి కడువడి నేయ - బెదరి వాఁ డొకవింటఁ బె ట్టొనరించి
తప్పించుకొని వియత్తలమున కెగసె - నప్పుడు పలుకయు నడిదంబుఁ గొనుచు
నలవుమై నంతలో నావాయుసుతుఁడు - తొలఁగక నాదైత్యుతోడనే యెగసి
గద వ్రేయుటయుఁ జూచి ఖడ్గ మంకించి - గద రెండుతునుకలుగా వ్రేసి డాసి
తొడలు వ్రేయుటయు వాతూలనందనుఁడు - పుడమిపైఁ బడి నభంబునకు బిట్టెగసి
ఖగనాథుఁ డురగంబు కబళించినట్టు - లోగి వానిచరణంబు లొడిసి రాఁ దిగిచి
తెగువఁ గుమ్మరసారె తీరునఁ ద్రిప్పి - జగతిపై వ్రేసిన జవమెల్లఁ దూలి
పొలుపరి తలనున్న బొమిడిక మూడి - కలభూషణము లుర్విఁ గనుకని చెదర
గుండియ పగిలి ప్రేగులు వాత దొట్టి - కండ లెల్లెడ రాలి కనుగ్రుడ్లు చెదరి770
యగలి యద్దానవునంగంబు లెల్లఁ - బగిలి నెత్తురు గ్రక్కి ప్రాణము ల్విడిచె.
వానిచా వటు చూచి వాసవాద్యమరు - లానందభరితాత్ము లై తన్నుఁ బొగడ
నంత నాహనుమంతుఁ డసమానవిజయ - వంతుఁడై యార్చి దుర్వారుఁడై యుండె.
చెదరినదనుజు లచ్చెరువుగాఁ బాఱి - త్రిదశారిసభఁ జొచ్చి దీనులై నిలిచి
"బలియుఁ డావానరపతి బాహుబలము - తలఁప నచ్చెరు వెందు దానవాధీశ!