పుట:Ranganatha Ramayanamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యురముపైఁ దొడలపై నుంచి మన్నించి - శిరము మూర్కొని ముద్దుచెక్కిళ్లు పుణికి
కరము ముద్దాడి నీగారాపుఁబట్టి - వరుస నంగదు నేల వారింప వధిప!"
యని ప్రలాపించుచు నతివ సుగ్రీవుఁ - గనుఁగొని పల్కె శోకము వెల్లివిరియఁ
“దలకొని వారిముందఱ నిల్వలేక - పలుమారు దెస చెడి పందవై పాఱి
గతిమాలి పోయి రాఘవుఁ దోడితెచ్చి - కృతకజయంబునఁ గిష్కింధఁ గొంటి!
నీకోరిన ట్లయ్యె; నీపగ దీరెఁ - గైకొని భోగింపు కపిరాజ్యపదవి;
నెడ మాటలాడ నాయినవంశుతోడఁ - గడు హనుమంతుఁడు గలిగెనే నీకుఁ?
బలుమాఱు బుద్దులు పరికించి చెప్ప - నల నీలతారు లున్నారులే నీకు?"600
నని పల్కి రఘురాము నబ్జాక్షి చూచి - “జననాథ! యీవాలిఁ జంప నేమిటికి?
మెఱసి ని న్నిటుచేయ మీతండ్రితోడ - గఱపెనే రఘురామ! గణుతింప వాలి?
వెరవొప్ప నీరాజ్యవిభవంబు గొన్న - భరతుఁడే రఘురామ! పరికింప వాలి?
చెనఁటియై నీదేవిఁ జెఱగొనిచన్న - దనుజుఁడే రఘురామ! తలపోయ వాలి?
వాలి నకారణవైరంబుఁ బూని - యేలయ్య! తెగటార్చి తిబ్భంగిఁ గడఁగి?
నీయట్టిసుకృతికి నీయట్టిపతికి - నీయట్టికారుణ్యనిధి కిట్లు తగునె?
జనకజతోఁ గూడి చనియెనో యెఱుక - ఘనమైనవిరహాగ్నిఁ గ్రాగెనో యెఱుక?
భూమీశ! నేఁడు నైపుణ్య మిట్లుండె - నేమి సేయుదు నింక? నేమందు విధికి?
నీవాలి నెడఁబాసి యే నుండఁజాల; - దేవ! నన్నును బట్టి తెగటార్పవయ్య!"
యని యురంబును మోము నందంద మోది - కొనుచు వారిని చేరుకొని ప్రలాపింప610
నావేళ హనుమంతుఁ డట తారఁ గదిసి - నీ వెఱుంగని ధర్మనియతులు గలవె?
యాజి వీరస్వర్గ మందిన వాలి - కీజాడ శోకింప నేల? యీ పనులు
దైవయత్నము లంచుఁ దాఁ బలుమాఱు - ధీవిచక్షణుఁ డిట్లు తెలుపుచునుండె.

వాలి సుగ్రీవునకు హేమదామ మిచ్చుట

నంతలోఁ గనువిచ్చి యమరేంద్రతనయుఁ - డింతింత యనరాక యింతి శోకింప
నంతకంటెను మించె నంగదునగపు - నంతయు నటు చూచి యర్కజుఁ జూచి
"పూని రామునిచేత భువనంబు లెఱుఁగ - భానుజ! నేఁడు నీపగ సాధ్యమయ్యె;
క్షితిమీఁద రాజులకృప నమ్మఁదగదు - మతి నుబ్బి చెడక యేమరక వర్తింపు;
మడరరామునితోడ నాడినప్రతిన - యెడపక గావింపు మిటమీఁద నీవు
పాయక నాతోన బలిమి పోరాడి - మాయావి కడిమిమై మడసిన మెచ్చి
పూనినవేడ్కతోఁ బురుహూతుఁ డిచ్చె - మానైన యీహేమమాలిక తొల్లి620
యిది నీవు ధరియింపు మీకపిరాజ్య - పదమున కిది నీకుఁ బరఁగు చిహ్నంబు
లీయంగదునిశోక మింక వారింపు - నాయట్ల గొనియాడు న న్మఱపింపు
మాసుషేణునిపుత్రి యైనయీతార - ధీసార దీనిబుద్ధిని బ్రవర్తిలుము.