పుట:Ranganatha Ramayanamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావ్యము

కిష్కింధాకాండము

209


ఏను జేసినతప్పు లెల్లను మఱువు - మూని నామెయిఁ బ్రాణములు నిల్వ వింకఁ
గైకొను మీమాలికారత్న" మనుచు - శోకానతగ్రీవు సుగ్రీవుఁ బిలువ
నతఁడును రఘురాము నానతి వడసి - యతిభక్తిఁ దాల్చె నాహైమదామంబు.
అనువొప్ప మఱి వాలి యంగదుఁ జూచి - తనమదిలో నున్న దయతోడఁ బలికె
"నోకుమారక! శోక ముడుగుము నీవు - శోకింప నేటికి సుగ్రీవుఁ డుండ?
నలినాప్తసూనుండు నాకంటె నిన్ను - లలిఁ బెంపుతో నుపలాలింపఁగలఁడు
సుగ్రీవుఁ డెక్కడ? శూరతఁ జూపె - నగ్రణివై యుండు మన్న! నీ వచట630
చిరతరకీర్తులు సిద్ధించు నీకు - నురుతరసౌఖ్యంబు లొగిఁ బొందు నీకుఁ
బరఁగఁ గిష్కింధకుఁ బట్టంబు గట్టి - యరయుచునుండఁ బుణ్యము సేయనైతి;
ననిమిషపురమున కరిగెద నింక” - నని చెప్పి రఘురాము నర్థితోఁ జూచి,
"యోరామ! యే నిట్టు లొదవి సుగ్రీవు - తో రాసి పోరాడ నది మధ్యమయ్యె
నారంగ నంగదుం డబల యేమైన - నేరముల్ చేసిన నేర్పుగాఁ గొనుము
ఇనసుతుతర్వాత నితని రాజుగను - మనువంశతిలకుండ! మహి నిల్పవలయు,
వేదశాస్త్రంబుల వెదకి ని న్గాన - రాదిమధ్యాంతంబు లవి లేవు నీకుఁ;
గను విచ్చి ప్రాణావసానకాలమున - నొనర నా కిదె తోఁచుచున్నాఁడ వీవు;
అటు పోయె ననియెడి యామూర్తిఁ గంటి - నటుగాన నేను గృతార్థుండ నైతిఁ
బంకజహితవంశ! పరమకల్యాణ! - యింకఁ బ్రాణము లుండ వీయమ్ముఁ బెఱుకు"640
మనిన రామునియాజ్ఞ నాదివ్యశరము - పొలుపొంద నీలుండు పెఱికివైచుటయు
గరమొప్పఁ దనబాహ్యగతులు బంధించి - మరలినపవనుతో మనసు సంధించి
యామెయిఁ బరమమై యింపారు రాము - శ్రీమూర్తి మనములోఁ జెలువొప్పఁ జేర్చి
బ్రహ్మపదానందపరుఁ డైన వాలి - బ్రహ్మరంధ్రంబునఁ బ్రాణము ల్విడిచె
నావేళఁ దారాదు లైన కామినులు - నావాలిపైఁ బడి యందంద వగవ
నంగదసుగ్రీవు లచ్చటిప్లవగ - పుంగవుల్ "హా! వాలి! పోయితే" యనుచు
విలపించుచుండ నావేళ సౌమిత్రి - నలినాప్తసుతుని నందఱి విచారించి
"హనుమంత! నీ వింక నంబరమాల్య - ఘనగంధసారాదికములు దెప్పింపు
శిబికఁ దెప్పింపుము శీఘ్రంబె తార - నిబిడహాటకరత్ననిర్మితంబుగను”
అని పంప వారెల్ల నట్ల కావింప - వనచరు లందఱు వచ్చి రచ్చటికి650
మఱి తార మొదలైన మగువలయడలు - తెఱఁగొప్ప వారించె దిననాథసుతుఁడు
నాలోన రఘురాము ననుమతి వడసి - వాలికిఁ బరలోకవైదికక్రియలు
చేసి యాదశరాత్రి శేషకృత్యములు - భాసురగతిఁ దీర్చి పరిశుద్ధిఁ బొంది
యంగదుండును దాను హనుమదాదులును - సంగతి నారామచంద్రుఁ గాంచుటయు
విపులసంతోషంబు విలసిల్ల నంతఁ - గపినాయకులకు రాఘవుఁ డిట్టు లనియె.