పుట:Ranganatha Ramayanamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతండ్రి తర్వాత మంత్రులు పెద్ద - యీతఁ డంచును వానరేంద్రపట్టంబు
వాలికిఁ గట్టి రావాలియు నన్నుఁ - జాల మన్నన చేసి సంప్రీతి నడుప
నతనికి బంటనై యహరహం బేను - బితృసమానుని గాఁగఁ బేర్మి సేవింతు
నీరీతి నన్యోన్యహితులమై మెలఁగ - శ్రీరామ! యొకనాఁడు చిరవైర మూని250
తొడరినకడఁకతో దుందుభి గన్న - గొడుకు మాయావి యన్ ఘోరరాక్షసుఁడు
నడురేయి కిష్కంధనగరంబు బెదర - వడి నార్చి గర్వదుర్వారుఁడై పేర్చి
యని సేయఁ బిలిచిన నలుక దీపింప - ననుపమజయశాలి యగు వాలి వెడలి
ననుఁ గూడి యుద్ధసన్నద్ధుఁడై కడఁగి - తనమీఁద నడువ నిద్దఱఁ జూచి వాఁడు

వాలి మాయావితో యుద్ధము చేయుట

అని సేయ మది భీతుఁ డై పాఱిపోయి - తనగుహఁ జొచ్చిన దర్పించి వాలి
యధికగర్వోద్ధతుం డగు వానిఁ బట్టి - వధియించి వత్తు నే వచ్చునందాఁక
నిచ్చట నేమఱ కీవు వేఱొకఁడు - చొచ్చి రాకుండ నిచ్చో నుండు మనుచు
గుహవాత నన్నుంచి గుహలోనఁ జొచ్చి - గుహలోన నొకయేఁడు ఘోరయుద్ధంబు
కడఁకతోఁ జేయ రక్తము వెల్లి వెరిసి - యుడుగక గుహవాత నుబ్బినఁ జూచి
కనుఁగొని యార్చురాక్షసుని యార్పులను - విని వాలి రాక్షసవిభునిచేఁ జచ్చె260
నిచ్చట నే నుండు టెఱిఁగిన వెడలి - వచ్చి యాదైత్యుండు వధియించు నన్ను
నని నిశ్చయము చేసి యప్పుడే పోయి - కొని వచ్చి యొకకొండ గుహవాత నునిచి
యచ్చట వాలికి నటఁ దిలోదకము - లిచ్చి కిష్కింధకు నేను వచ్చుటయు
వాలి వోయినతరువాత నీరాజ్య - పాలనంబున కీవె ప్రాప్తుండ వనుచు
వదలక మంత్రులు వానరరాజ్య - పదమున ననుఁ దెచ్చి పట్టంబు గట్ట
వానరకులచక్రవర్తినై యేను - నూని రాజ్యము సేయుచుండితి నంత.
మనుజేశ! మఱి వాలి మాయావిఁ జంపి - ననుఁ జీరి చీరి యంతట గుహ నేను
పెనిచి వైచినకొండ పిండిగాఁ దన్ని - చనుదెంచి నేలేమిఁ జాలఁ గోపించి
కినుకతో మఱి వాలి కిష్కింధఁ జొచ్చి - తనకు నేఁ జేయు వందనము గైకొనక
"యోరి తమ్ముఁడవని యూరడి నమ్మి - పోరాడఁ బగరపైఁ బోయినచోట270
నను డించి చనుదెంచి నారాజ్యపదము - గొని ప్రీతి నేలుట కూడునే నీకు?
కడుఁబాపబుద్ధివి గావున నిన్నుఁ - దొడరి చంపిన నాకు దోసంబు లేదు.”
అనవుడు నేవాలి యడుగుల వ్రాలి - వినయంబు భయమును వెలయ నిట్లంటి.
“నొకయేఁడు మాయావియును మీరుఁ బోరఁ - బ్రకటించి రక్తపూరము గుహవాత
వెడలిన భయమంది విపరీతబుద్ధి - వడిఁ బాఱి యిచటికి వచ్చినఁ జూచి
రట్టడిమంత్రు లీరాజ్యంబు నాకు - గట్టి రింతియకాని కపట మే నెఱుఁగ
నాకు మీయాగమనంబె శోభనము - నీకపిరాజ్యంబు నీవె కైకొనుము