పుట:Ranganatha Ramayanamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వావిఁ దమ్ముఁడఁ గాని వాలి! నీ కేను - సేవకుండ సుతుండఁ జెప్ప నేమిటికిఁ?
గరుణాఢ్య! నాయెడఁ గల్ల గల్గినను - గరుణింపు" మని పెక్కుగతులఁ బ్రార్థింప
నంతకంతకు మండి యనుజునిపట్ల - నింతేల యని మంత్రు లెంత దెల్పినను280
అనయుఁడై నాపత్నియగురుమఁ బుచ్చు - కొని రాజ్యమును బుచ్చుకొని చంపఁగడఁగె
వెఱచి యేకాకినై వెనుకొని వాలి - తరుమ భూలోకమంతయు నేను దిరిగి
యేపఱి పరతెంచి యిందున్నవాఁడ- నీపర్వతము వాలి కెక్కరాకునికి ”
ననిన రాముఁడు వెఱగంది "యీకొండ - యినతనూభవ! వాలి కె ట్లెక్కరాదు?
వినుపింపు" మనవుడు వినతుఁడై నిలిచి - యినతనూజుఁడు ప్రీతి నిట్లని పలికెఁ.
“దొల్లి దుందుభియను దుష్టరాక్షసుఁడు - బల్లిదుఁడై వరబలము రంజిల్ల
ముల్లోకములు తనమొనకు భీతిల్ల - మల్లడియై కారుమహిషమై పోయి
తఱిమి సముద్రుని తనతోడ ననికి - నఱమి పిల్చుటయు నయ్యంబుధి గలఁగి
ఘనరత్నకోటులు కానుక లిచ్చి - "తునియక బల్మి నీతోను బోరాడ
ఘనుఁ డైన వింధ్యాద్రి గాని యేఁ బూని - యని సేయఁజాలఁ బొ"మ్మనిన నేతెంచి290
జంధారిదోస్తంభసంభావితోగ్ర - దంభోళినైశిత్యదర్పభంగముల
నతులశృంగముల వింధ్యాద్రిఁ జోరాడ - నతిభీతుఁడై పర్వతాధీశుఁ డనియె
“నీసరివాఁడనే నిల్చి నీతోడ - నోసరింపక పోర నోర్తునే యేను
నీలోకమున నిన్ను నెదిరి పోరాడ - వాలినభుజశక్తి వాలికిఁ గలదు
బలియుఁడై కిష్కింధ పాలించు నతఁడు - కలహంబుపై వాంఛ గలదేని నీకు.

వాలిదుందుభుల యుద్ధము

నలఘువిక్రమః యింక నం దేగు" మనినఁ - జెలఁగి రాక్షసుఁడు కిష్కింధ కేతెంచి.
విలయకాలాభీలవేళ గర్జిల్లు - జలదంబుగతి నార్చి సరిఁ దనతోడ
నాలంబు సేయ ర"మ్మని తనుఁ బిల్వ - వాలి కోపించి వెల్వడి వచ్చి యార్చి
"దుందుభిగతి మ్రోయు దుందుఖిఁ దాకి - యెందుఁ బోవఁగ వచ్చు నింక నీ" కనుచు
శిలలు పాదపములు చెచ్చెఱ ఱువ్వి - తల ముష్టిహతులఁ గొందలమందఁ జేయ300
వాఁడును వానరేశ్వరునివక్షంబు - వాఁడికొమ్ములఁ గుమ్మ వాలి కోపించి
అతిఘోరుఁడై పేర్చి యచలంబు వైవ - గతిదప్ప నురికి రక్షసుఁడును వైవ
గండశైలము బుచ్చి కపిరాజు వైవ - నొండొండఁ గొమ్ముల నోహరించుచును
అరి గ్రమ్మికొని వాలి నదరంట వ్రేయ - తరిమి వృక్షంబునఁ దరువరుం డదవ
మాటున నసుర క్రమ్మఱ వచ్చితాఁక - మోట తా నెత్తుక మోదె నావాలి
కదిసి కొమ్ములఁ జిమ్మఁ గపిరాజు నిలిచి - కదలనిముష్టి వక్త్రంబునఁ బొడువ
రక్కసుఁ డొడువ మర్కటరాజుఁ బొడువఁ - దక్కక యిరువురు దర్పించి పేర్చి.
కొనకొని నూఱేండ్లు ఘోరయుద్ధంబు - మనువంశవల్లభ! మఱి చేసి వాలి