పుట:Ranganatha Ramayanamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మావంటిప్రాకృతమనుజులయట్ల - నీవును శోకింప నీతియె? దేవ!”
యనుడు సుగ్రీవునియాప్తవాక్యములు - విని ధీరుఁడై రఘువీరుఁ డెంతయును
"ఇంతి వోయినజాడ నెఱిఁగినపిదప - నంతరంగంబున నడలుచు నునికి
మగపాడి గా" దని మది నిశ్చయించి - జగతీశుఁ డంతట సంతాప ముడిగి
సరసిజాననఁ బూని సాధించుపనికిఁ - బరికించి మును వీని పగ దీర్తు ననుచు
మీనాక్షితొడవు సౌమిత్రిచే నిచ్చి - భూనాథుఁ డట నర్కపుత్రు నీక్షించి220
“యాపదమున సఖుఁ డైనట్లు చుట్ట - మాపాటి గానేరఁ దారసి చూడ
గుణవంతుఁ డైనను గుణహీనుఁ డైన - గణియింప సఖుఁడె సద్గతి యండ్రు బుధులు
గావున నీచెలి గలిగిన నాకు - నేవెంటఁ గొదవ లే దిది నిశ్చయంబు
నీపత్నిఁ గైకొని నినుఁ జంపఁగోరు - పాపాత్ముఁ డగువారిఁ బరిమార్తు నిపుడు
అన్నదమ్ములమైత్రి నలరుటకంటె - నున్నదా సౌఖ్యమా యొరిమెకు మాని
యగచరాధిపుఁడ నీయన్నకు నీకుఁ - బగ యైనవిధము దప్పక చెప్పు" మనిన
"నోరామ! వాలికి నొగి నాకు నైన - వైరానుకథనంబు వర్ణింతు వినుము
కడఁగి మంథరగిరి కవ్వంబుఁ జేసి - తడయక వాసుకిఁ దరిత్రాడు చేసి
మమ్ము దేవత లెల్ల మన్నన సేయఁ - గ్రమ్మినఁ దెలిసిమై ఘనభుజాబలము,
వాలియు నేనును వడి నొక్కవంక - వ్రాలితి మొకవంక వ్రాలిన వారు230
సురగరుడోరగాసురసిద్ధసాధ్య - వరు లందఱును క్షీరవారిధిఁ దరువ
గరళంబు పుట్టి లోకము లెల్ల గాల్ప - హరుఁ డదియును మ్రింగ నద్భుతం బనఁగ
అలరంగ జ్యేష్ఠయు నం దుదయింపఁ - గలిరాజు దానిని కైకొనెఁ బ్రీతిఁ
బ్రస్తుతి కెక్కుచు బహుళంబు లైన - వస్తుచయంబు లవ్వారిధిఁ బుట్టెఁ
దమతమకోర్కెకుఁ దగినవస్తువులు - అమరంగఁ గైకొని రందఱు ప్రీతి
నలిఁ బుట్టె నైరావతము మేషమహిష - ములు మకరకరేణువులు హయవృషభ
మవి జనియింప నింద్రాదిదిక్పతులు - వివిధయానములుగా వేడ్కఁ గైకొనిరి.
మహనీయసౌభాగ్యమహిమలు తనకు - సహజంబులై లక్ష్మి జనియింపఁ జూచి
యామహాలక్ష్మి నారాయణుం డపుడు - కామించి తనదేవి గాఁగఁ గైకొనియెఁ.
జంద్రుఁడు దేవతాసతు లుదయింప - నందఱిలోఁ దార యనునాతి మాకు240
దేవత లిచ్చినఁ దివిరి గైకొంటి - మావిధంబున మఱి యందఱుఁ దరువ
జనియించె నమృతంబు సకలదేవతలు - ననురాగమును బొంది యాసుధారసము
కామధేనువు కల్పకము లాదిగాఁగ - సోమునిఁ గొని తమచోటికిఁ జనుచు
నమరులు మమ్మంప నర్థితో వచ్చి - కమనీయపదమునఁ గాంతతోఁ గూడి
కలసియుంటిమి కొంతకాలంబుదనుక - అలరు సుషేణుని యనుఁగుఁగూఁతురును
జెలువొప్పఁ బెండ్లియై చెలఁగు వేడుకల - వలనొప్ప రుమ గూడి వర్తించుచుండ