పుట:Ranganatha Ramayanamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాదశరథపుత్రుఁ డాసుచరిత్రుఁ - డాదయాపరమూర్తి యాసత్యవాది
యామహాభుజశాలి యామహాబలుఁడు - శ్రీమహావిష్ణుండు శ్రీనివాసుండు
ఆపుణ్యనిధి రాముఁ డట నీకుఁ గర్త - నీపుణ్య మే మన నేర్తు సుగ్రీవ!
యామహాత్ముఁడు తండ్రియానతి దండ - కామధ్యమున నుండఁగా దశాననుఁడు
దనదేవి మ్రుచ్చిలితనమున నెత్తి - కొనిపోవ వాని మార్కొని త్రుంచి వైవఁ
జింతించి నీతోడి చెలిమి వాటింప - నెంతయుఁ దలపోసి యేతెంచె నిటకు"
ననిన సుగ్రీవుండు హర్షంబు నొంది - యనిలనందనుఁ జూచి యర్థితోఁ బలికెఁ.
“బవనజ! నాలోని భయ మెల్ల నడఁగెఁ; - దవిలి యేఁజేసిన తప మెల్లఁ బండె.
నలవడ నాకు నీయట్టియంజనము - గలుగుటఁ గంటి రాఘవనిధానంబు160
గలఁగక నీవంటి కర్ణధారుండు - గలుగ నీశోకాబ్ధి గడతేరఁ గంటిఁ.
గడఁకతో ఋశ్యమూకమునకు వారిఁ - దోడ్తెచ్చి నాలోనిదుఃఖంబు మాన్పు
పొ" మ్మనవుడు వాయుపుత్రుండు వోయి - నెమ్మితో రఘురామనృపతికి మ్రొక్కి
“దేవ! సుగ్రీవుండు దేవరసఖుఁడు - దేవ ని న్దర్శింపఁ దివురుచున్నాఁడు
విచ్చేయుఁ" డని విన్నవించిన రాముఁ - డిచ్చలో హర్షించి యింపు సొంపొంది
హనుమంతుఁ గొనియాడి యతిపుణ్యలగ్న - మున హనుమంతుని మూపులమీఁదఁ
దనతమ్ముఁడును దాను దగ ఋశ్యమూక - మున కేగి యానందమును బొందె; నపుడు
హనుమంతుఁ డంత నేకాంతంబునందు - మనుజేశ్వరులఁ బెట్టి మలయాద్రి కరిగి
శ్రీరామదర్శనోద్గ్రీవు సుగ్రీవుఁ - జేరి “నీకోరిక చేకూఱె నింక
రా దేవ వచ్చిరి రామలక్ష్మణులు - ఆదట ఋష్యమూకాద్రికి" ననుడు170
నినతనూజుఁడు ప్రీతి నిచ్చలో నుబ్బి - మనుజవేషముఁ బూని మకుటకేయూర
ఘనతరశృంగారకలితుఁడై మగిడి - తనమంత్రులును దానుఁ దడయ కేతెంచి
డక్కినభక్తితో డాసి రామునకుఁ - జక్క సాగిలి మ్రొక్కి సంప్రీతి నొంది
ముకుళితహస్తుఁడై ముందఱ నున్న - నకలంకు సుగ్రీవు నధిపతిఁ జూచి
యాలింగనము చేసి యప్పు డిట్లనియె - నాలోన దరహాస మమృతమై తిరుగ
“నీవాయుపుత్రుచే నినసుత! యేను - నీవిక్రమంబును నీభుజాబలము
విని ప్రీతి నొందితి వెఱవకు మింక - నెనసినపగవాని నేనె చంపెదను
నా కాప్తబంధుండు నమ్మినసఖుఁడు - నీకంటే నొకఁడు గణింపఁగఁ గలఁడె?”
యని యూరడించిన నర్కనందనుఁడు - “ననిచినబంటుగా నన్నుఁ గైకొంటి.
దేవ! నీకారుణ్యదృష్టి నన్ సోఁక - నేవెంట ధన్యుఁడ నేనె పో యింక180
నలినాప్తకులనాథ! నాయట్టిబంటుఁ - గలిగె నీ కటుగానఁ గడిమిమై నింకఁ
దివిరి రావణుని వధించితిఁ గడఁగి - యవనిజఁ గైకొంటి నని నిశ్చయింపు"
మని రామసుగ్రీవు లన్యోన్యభాష - లనలుసన్నిధిఁ జేసి యకలంకు లైరి.