పుట:Ranganatha Ramayanamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హనుమంతుఁడు తనజన్మప్రకార మెఱిఁగించుట

వచ్చితి మిచటి; కెవ్వఁడవు నీ వింక - నచ్చుగా నెఱిఁగింపు మనఘ! నీతెఱఁగు"
ననవుడు హనుమంతుఁ డారఘుకులులఁ - గనుఁగొని మ్రొక్కి తక్కక విన్నవించె;
"నెలమి మాతల్లికి నెలమి జన్మించి - వలనొప్ప నొకకొన్ని వర్షము లనఁగ
నొకకారణమునకై యొకబ్రహ్మఁ గూర్చి - ప్రకటితమతి నేఁ దపంబు సేయఁగను
పరికించి సరసిజభవుఁ డేగుదెంచి - "వరము వేడు" మటన్న వలగొని మ్రొక్కి
వేవేలువిధముల వినుతులు చేసి - “యోవిమలాత్మ! యీయుర్విపై నాకు
గతిమోక్షకామ్యార్థకారణంబులకుఁ - బతి యెవ్వఁ డతని నేఁ బ్రార్థించి కొలుతు"
నని విన్నవించిన నబ్జసంభవుఁడు - తనమనోవీథిని దలపోసి చూచి
"యొనరంగ నీమేనియురుభూషణములు - కనుఁగొన్నయాతఁడె గతియును బతియు
ధాతయు మన కిష్టదైవంబు సకల - భూతజాలములకు భువి కెల్ల కర్త130
నతఁ డెవ్వఁ డనిన వాఁ డతఁడె విష్ణుండు - అతఁడె నీగతి యని యది యాత్మఁ దెలియు"
మని బ్రహ్మ చనియె నే నదియును గాక - ఘనబుద్ధిఁ జరియింతుఁ గలయ లోకముల
భూపాలతిలక! నాభూషణావళులు - దీపించఁ గానరు దివిజు లందఱును
మఱియును సౌమిత్రి మారుతిఁ జూచి - తెఱఁగొప్ప నతనితో ధీరుఁడై పలికె.
“విను రాఘవుఁడు లోకవిఖ్యాతసత్వుఁ - డనుపమదివ్యాస్త్రుఁ డతులసాహసుఁడు
కరుణాపయోధి యగాధమానసుఁడు - శరణాగతత్రాణ సద్ధర్మపరుఁడు
జగదేకనాథుఁ డశరణశరణ్యుఁ - డగణితగుణగణ్యుఁ డధికతేజుండు
అతిలోకవిక్రముం డతిసత్యవాది - హితుఁడనై బంటనై యేను వర్తింతుఁ.
గావున రాఘవక్ష్మాపాలమణికి - లే వసాధ్యంబులు లెక్కింప నెందుఁ
గుటిలరాక్షసుఁ డున్నగుఱుతు మున్నెఱిఁగి - యిట సీత సాధింప నేము చాలుదుము140
అలపుమై నేకాకు లై పోవఁ దగదు - దలపోయ నిది రాజధర్మంబు గాదు
గాన నీసుగ్రీవుఁ గైకొను తలఁపు - మానవాధీశ్వరుమదిలోనఁ గలదు
ఇటమీద నీకార్య మేవెంట నైన - ఘటియింపు" మనవుడు కరువలిసుతుఁడు
నెఱయ సంతస మంది నిజమూర్తిఁ జూపి - మఱి తన్ను రామలక్ష్మణులు మన్నింపఁ
దను గృతకృత్యుఁ గా దలఁచె నాబలులు - వనచరరాజునె వరుస నెన్నుచును
గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగఁ - గొనియాడి కొనియాడి కోర్కె దీపింప
మనమున సంతోషమగ్ను లై యపుడు - అనిలజు వీడ్కొల్ప నతిసంభ్రమమున
నరిగి రాఘవులవృత్తాంతమంతయును - దొరకొని సుగ్రీవుతోఁ జెప్పఁదొడఁగె .
“రమణీయమూర్తులు రామలక్ష్మణులు - కమనీయగుణములు గలిగి వర్తింతు
జగతిపై నతిశోకసాగరమగ్నుఁ - డగు నీకు రఘురాముఁ డను తెప్ప దొరకె;150
బ్రదికితి సుగ్రీవ! పగయెల్లఁ దీఱెఁ; - దుదముట్టఁ గలిగె సంతోషంబు నీకు