పుట:Ranganatha Ramayanamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెనువెన్క దిగియ నవ్వెలఁది కౌసల్యఁ - గనుఁగొని వాక్కాయకర్మచిత్తముల
"శ్రీరామునకుఁ గీడుఁ జేసితి నేని? ధారణి నే నేలఁదలఁచితి నేని?
నేను గైకతలంపు నెఱిఁగితి నేని? - నే నొకకీడైన నెఱిఁగితి నేని?1370
వినుము మద్యంబు ద్రావినవానిగతికి - పెనుపేదవిప్రుఁ జంపినవానిగతికిఁ
దెగి గురుపత్నిఁ బొందినవానిగతికి - జగతిపైఁ దా నోడి చనువానిగతికి
చెనఁటియై పసిఁడి ముచ్చిలువానిగతికి - నెనసి గోహత్య చేసినవానిగతికి
న్యాయంబు దప్పిన నరనాథు గతికి - నేయెడఁ గొండెగాఁ డేగెడుగతికి
శరణార్థుఁ బ్రోవని దురితాత్ముగతికి - వరధర్మవిక్రయవాంఛితుగతికి
గురువులఁ దిట్టిన కుటిలాత్ముగతికి - నరయ స్వామిద్రోహి యగువానిగతికిఁ
దల్లిదండ్రులఁ దిట్టు తనయునిగతికిఁ - గల్ల లాడెడు పాపకర్మునిగతికిఁ
పరధనంబుల కాసపడువానిగతికి - పరసతిఁ గలిసిన పాపాత్ముగతికిఁ
జనువాఁడ నిందుకు సాక్షి దేవతలు - ఈపాపకర్మురా లిటు చేసెఁ గాక
యేను రాముని కేల యెగ్గు గావింతు - నీనీచకర్మంబు లేడ? నే నేడ?”
నని యేడ్చు భరతుశోకాగ్నులపెంపుఁ - గనుఁగొని కౌసల్య కడుభీతిఁ బొంది1380
యిటువంటిపుణ్యాత్ము నేల దూఱితిని? - గటకటా!" యని పొక్కి కౌఁగిటఁ జేర్చి
భరతశత్రుఘ్నులపై వ్రాలి తూలి - పరితాప మొందుచుఁ బలవించుచుండె.
నంత వసిష్ఠసంయమి వారిఁ గొనుచు - నంతఃపురంబున కడలుచుఁ బోవఁ
‘‘గనుఁగొనఁగా రాదు కై కేయి గన్న - తనయుండు వీఁ" డని తనమీఁద నలిగి
పెనుపొంద మాణిక్యపీఠిపై నొరిగి - తనుఁ జూడనొల్లని తలఁపున రోగి
కనుఁగవ మూసినగతి నున్నతండ్రిఁ - గనుఁగొని భరతుండు కడుమూర్ఛఁ బొంది
తెలిసి క్రమ్మఱఁ జూచి తీవ్రంపువగల - వెలువరింపఁగరాక విలపింపఁదొడఁగె.
"వసుధేశః! కేకయావనిపాలుచేత - నసమానమణిభూషణావళి నీకుఁ
గొనివచ్చినాఁడఁ గైకొన నొల్లవేమి? -ననుఁ జూడ వది యేమి? నాతప్పు లేమి?1390
కడుఁబాపమతి యైన కైకేయి గన్న - కొడు కని ననుఁ జూడఁ గూడదోకాక?
ధరణీశ! యాసుమిత్రాపుత్రుఁ జూడు - పురపురఁ బొక్కుచుఁ బొరలుచున్నాఁడు
కడఁగి నీహస్తసంకజములఁ బట్టి - తుడవ వేమిటికి శత్రుఘ్నుపై ధూళి
వితనిఁ గటాక్షింపు మితనితోఁ బల్కు - మితనిఁ గౌఁగిఁటఁ. జేర్చు మితఁ డేమి చేసె?
నీమంచితనమును నీదయారసము - నీమొగమోటము నేఁ డెందుఁ బోయెఁ?
గైకేయి నీబుద్ధి గలఁచెనే తండ్రి? నీ కిట్టిమరణంబు నేర్చెనే కలుగఁ?
జావరే నృపు లెందుఁ జత్తురు గాక - లేవుకా కిట్టివి లేవుగా నెందుఁ?
బడఁతులు మెప్పించి ప్రాణవల్లభుల - నడుగరె? యీయీవు లడుగరు కాక!
యీకష్టవర్తనం బేమిటఁ గడతుఁ? -జేకూరె నిఁక నేమి సేయుదు" ననుచుఁ