పుట:Ranganatha Ramayanamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"దలకొని తొల్లి మీతండ్రి నాకర్థి - వలను మీఱఁగ రెండువరము లిచ్చుటయు
నొకటికి భరతుని నుర్వి నేలింప - నొకటికి రఘురాము నునుప దుర్గముల
నని వేఁడుటయుఁ దండ్రియానతిఁ బూని - జనకజాలక్ష్మణసహితుఁడై మునుల
యనువున రఘురాముఁ డడవికిఁ బోయెఁ; - దనయుని నెడఁబాసి ధరణీశుఁ డీల్గె.1340
నీసున నీకుఁగా నీయుపాయంబు - చేసితి రాజ్యంబు చేకొను మింకఁ,
బ్రజలఁ బాలింపు సంపదలఁ దేలింపు - భుజశక్తి నేలుము బుద్ధి నొండనక”
ననవుడు మూర్ఛిల్లి యవనిపైఁ ద్రెళ్ళి - ఘనరోషదృష్టిమైఁ గైకేయిఁ జూచి
“కైక! నాతల్లివై కరుణకుఁ బాసి - యీకష్టవర్తన మేల కైకొంటి?
మునివేషమున వనంబున రాము నుండు - మని పల్క నెట్లు నో రాడెనే తల్లి?
యరయ నిర్మలధర్ము లైనరాఘవుల - చరితంబు నీకు విచారింపఁదగదె?
యే నింక మాతండ్రి కేమని వగతు? - నేను రామునిమొగం బెటువలెఁ జూతు?
నెంత లోఁ గుందెనో యిచ్చలో రాముఁ? - డెంత కోపించెనో యేచి లక్ష్మణుఁడు?
యెంత దూఱెనొ కాన కేగుచో సీత? యింత కే మయ్యెనో యింతి కౌసల్య?
యంతఃపురాంగన లాసుమిత్రయును - వంతచే నేమని వగచుచున్నారొ?1350
వీరలకడ కేగి విలపింప నాకు - నో రెద్ది? యెట్లు మనోవ్యథఁ దీర్తు?
నింక నీపుర మేల? యీభోగ మేల? - శంకింప కడవియే శరణంబు నాకు.
ఘనపాపరతిఁ జేసి కడఁగి మీతల్లి - నిను నొక్కరక్కసునికిఁ గన నోపుఁ!
గాని కేకయరాజుఁ గన్నకూఁతురవు - గానేర వేమందు కైక! నీతోడ"
నను మాట లన్నియు నల్లనఁ బొంచి - వినుచున్నమంథర వెసఁ జూచి ప్రజలు
ఇన్నిపాపంబులు నిదియ చేయించె - నన్న శత్రుఘ్నుఁడు నావృద్ధవనిత
గూను డొంకులు దీఱ క్రొమ్ముడి జాఱ - మేనిసొమ్ములు వీడ మెలఁతలు చూడ
కడకాలుఁ బట్టి యాకసమునఁ ద్రిప్పి - పుడమిపై వ్రేసె నప్పుడు చాల నలిగి
కైకేయిసతు లెల్ల కనుకని చెదరఁ - గైకను వధియింపఁ గడఁగిన నంత
భరతుండు చూచి "యీపాపాత్మురాలిఁ - బొరిగొని పాపంబుఁ బొంద నేమిటికి?1360
పెనుపేది తల్లిఁ జంపిననీచు లనుచు - మనలఁ జూడఁగ రోయు మది రామవిభుఁడు
అటుగాన వల” దని యతని వారించి - యటు పోయి కౌసల్యయడుగుల కెఱఁగి

భరతుఁడు కౌసల్యయొద్దకుఁ బోవుట

తాను దమ్ముఁడు శోకదందహ్యమాన - మానసులై పలుమా ఱెలుఁగెత్తి
పలవింప నప్పు డాభరతునిఁ జూచి - యలిగి కౌసల్య యిట్లని దూఱఁబలికె.
"పతిఁ బాసి సుతుఁ బాసి బహుళదుఃఖముల - మతి మాకు శోకింప మఱిఁ దగుఁగాక
నీ కేల శోకింప? నెలకొని యింత - నీకోరిన ట్లెల్ల నీతల్లి చేసె;
నన్న నీ వింక రాజ్యము సేయుచుండు" - మన్నఁ జేతులు మోడ్చి యతఁడు భీతిల్లి