పుట:Ranganatha Ramayanamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలుమాఱు విలపించు భరతునిఁ జూచి - తెలిసి వసిష్ఠుండు తెఱఁగొప్పఁ బలికె 1400
“అనఘాత్మ! మీతండ్రి యవని నంతయును - వినుతింప నటువదివేలేండ్లు నేలె.
మనుమార్గనియతి ధర్మము లెల్లఁ జేసె - గొనకొని మీయట్టికొడుకులఁ గనియెఁ
గావున నీవు శోకము మాను మింకఁ - గావింపు మగ్నిసంస్కారాదివిధుల"
ననవుడు నౌఁగాక యనుచు మర్నాఁడు - మునుల రాజుల మహాత్ములఁ బిలిపించి
వల నొప్ప దశరథేశ్వరుకళేబరము - కలఁగొని తీర్ధోదకము లార్చి తెచ్చి
వరవస్త్రభూషణావళులఁ గైసేసి - తరమిడి వేదోక్తదానముల్ సేసి
పరఁగ విమానంబుపైఁ దెచ్చి పెట్టి - యరుదైన మంత్రపూతాగ్నిఁ జేపట్టి
తనతమ్ముఁడును దాను దగ వసిష్ఠాది - మునులతో భరతుండు ముందఱ నడువ
నావిమానమునకు నందందఁ గదిసి - వావిరి యేడ్చుచు వగలఁ దూలుచును
మునుకొని కౌసల్య మొదలుగాఁ గలుగు - వనిత లందఱుఁ గూడి వరుస నేతేర1410
సరయువుచేరువ శవభూమియందుఁ - దిరముగా సొదఁ బేర్చి త్రేతాగ్ను లనిచి
యొలసినభక్తి వేదోక్తమార్గమున - నెలకొని దశరథనృపతి దహించి
తగురీతి మఱి తిలోదకములు వోసి - తగవుతోఁ బిండప్రదానము ల్చేసి
నగరికి వచ్చి యున్నతి భూసురులకుఁ - దగఁ బితృప్రీతిగా దానము ల్చేసి
తెఱఁగొప్పఁ బండ్రెండుదినములు వలయు - తెఱఁగులు నడిపి వర్తించుచో నంతఁ
గొనకొని యిక్ష్వాకుకులగురుండైన - మునివసిష్ఠుఁడు కార్యములు విచారించి
తాను రాజన్యులు తగుమంత్రివరులు - భానుసన్నిభతేజు భరతునిఁ జూచి
"వరతేజ! మీతండ్రి పరలోకమునకు - నరిగె, శ్రీరాముఁడు నరిగెఁ గానలకు;
నుర్వికి రాజు లేకున్న కార్యములు - నిర్వహింపఁగ రాదు నిల్వరు ప్రజలు
ధారణి చరియించు ధర్మంబు లణఁగు - వైరులు మింతురు వర్ణము లలయు1420
నవని యిరాజకమై యుండఁదగదు - ప్రవిమలమతి నీవు పట్ణంబుఁ బూను"
మని బుద్ధి చెప్పిన నమ్మునినాథుఁ - గనుఁగొని భరతుండు గరములు మొగిచి
"యిది యేమి మునినాథ! యింత మూఢుఁడనె - మది నింత నెఱుఁగనె మాకులక్రమము
నన్నఁ గానలఁ ద్రోచి యక్కటా! నన్ను - గన్నతండ్రినిఁ జంపెఁ గడఁగి మాతల్లి
యింత చాలదె నాకు? నింక రాజ్యంబు - చింతింతునే యేను? జెప్పకు మింకఁ
గైకేయికొడు కని కడఁగి పల్కెదవు - గాక యీతలఁపులు గలవె నాయందు?
నిట్లున్నరూపున నేను మారాము - పట్టంబు గట్టెదఁ బ్రార్థించి తెచ్చి
కాకున్న మాయన్న గైకొన్ననియతిఁ - గైకొందు గా కొండు గలుగునే మాకు?"

భరతుఁడు రామునియొద్దకుఁ బోవుట

నని నిశ్చయము చేసి యపుడు మంత్రులను - గనుఁగొని "మాయన్న గానఁ బోవలయు