పుట:Ranganatha Ramayanamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నాకులభూషణ! నాముద్దులయ్య! - నాకూర్మికొమరుండ నను గన్నతండ్రి!
క్రేపు బాసినయావుక్రియ నిన్నుఁ బాసి - యీపదునాలుగేం డ్లిందుండఁజాల;
నినుఁగూడి చనుదెంతు నిష్ఠురాటవుల" - కని ప్రలాపించు నయ్యంబ నూరార్చి
యనునయాలాపదీనాస్యుఁడై రాముఁ - డనియె "నోయమ్మ! యి ట్లాడంగఁ దగునె?
పతియె ప్రాణపదంబు పతియె చుట్టంబు - పతియె దైవత మాత్మఁ బరికింప నట్టి
పతిఁ బాసి నావెంటఁ బఱతెంతు ననుట - మతిఁ దలంపఁగ ధర్మమా తల్లి! నీకు?
వసుధేశునానతి వసుమతిభార - మెసఁగ నాభరతున కిచ్చుట తప్పె?500
నవనీశుఁ డిచ్చెద నన్నవరంబు - లవిరెండు కైకేయి యడుగుట తప్పె?
ననృతంబునకు నోడి యకట! రాజేంద్రుఁ - డొనరంగ వరము ని ట్లొసఁగుట తప్పె?
మాతండ్రియానతి మది నిర్వహించి - యేతెఱంగునఁ బూను టిది నాకుఁ దప్పె?
చేకొని పతిపంపు చెల్లింపకున్న - నీకైనఁ దప్పదు నిక్కువం బరయఁ
బోని కానల కేను బోయిన మిగుల - దీనుఁడై పొగలు పార్థివుని నీ వెపుడు
ననునయించుచు సపర్యలు నొనర్పుచును - మనసునుమ్మలికంబు మాన్పంగ వలదె?
దురితదూరుండు బంధురనీతిరతుఁడు - భరతుండు నాకన్న భక్తి ని న్నరయు
నీవు శోకింపకు నీకలనైన - భావింప దశరథపతి యొప్పుఁ దనకు
కైకేయి విడువక కలిసి వర్తింపు - నాకు సేమము గోరి నను వీడుకొలుపు"
మని పల్కి మ్రొక్కిన నారామచంద్రుఁ - గనుఁగొని కౌసల్య కౌఁగిటఁ జేర్చి510
క్రమ్మెడు శోకాశ్రుకణము లందంద - వెమ్ముచు రఘురాము వీపున రాల
“నడవికిఁ బోయేదే యకట! నీ" వనుచుఁ - గొడుకుమై నిమిరి డగ్గుత్తికఁ బెట్టి
యొక్కింత ధృతిఁ బూని యుల్లంబులోనఁ - జెక్కిటఁ గన్నీరు చేత బోఁ దుడిచి
పావనజలములఁ బ్రక్షాళితాస్య - యై వచ్చి పుణ్యాహ మపుడు సేయించి
సురలును ఖేచరుల్ శ్రుతులును యతులు - తరులును గిరులును దాంతియు శాంతి
నదులును నిధులు నర్ణవము నాకసము - నుదకంబు మారుతం బుర్వియు నగ్ని
దిక్పాలకులు దశదిశలు చంద్రార్క - వాక్పతిప్రముఖులు వలనొప్ప నీకు
స్వస్తి యెల్లప్పు డొసంగుదు” రనుచుఁ - బ్రస్తుతి జేసి యాభామాలలామ
పొలుపొంద వేల్పులఁ బూజించి రాము - వలచేత నొకరక్ష వలనొప్పఁ గట్టి
“యలిగి వృత్రాసురు ననిఁ జంపఁబోవు - బలభేది యగు వజ్రపాణికిఁ దొల్లి520
యేమంగళము లిచ్చి రెల్ల దేవతలు - నామంగళములు నీ కగు రామచంద్ర!
యరుదుగా దివి నున్న యమృతంబుఁ దేరఁ - గరమొప్ప నరిగెడు గరుడున కర్థి
నేమంగళము లిచ్చె హితమతి వినత - యామంగళములు నీ కగు రామచంద్ర!”
యని రాము దీవించి యక్కునఁ జేర్చు - కొని మస్తకంబు మూర్కొని నిండుమదిని
అనిపినఁ దమతల్లియడుగుల కెఱఁగి - యనుజన్మసహితుఁడై యచ్చోటు వెడలి