పుట:Ranganatha Ramayanamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శూరత నిక్కడ చూపంగ నేల - వైరులయందును వర్తింతు గాని”
యనినఁ గౌసల్యయు నారాముఁ జూచి - “వినుము నీతమ్ముని విమలవాక్యములు
శౌర్యంబు చేపట్టు జనులెల్లఁ బొగడ - నార్యసమ్మతముగా నవనిఁ బాలింపు
సవతిమాటలకు రాజ్యము మాని యడవి - నివసింపఁ బోవుట నీకు ధర్మంబె?
నాయింట నుండుము నాదుశుశ్రూష - సేయు మింతటికంటె క్షితి ధర్మ మెద్ది
జనకువాక్యము సేయఁ జాలిన నీకు - జననివాక్యం బెన్న సన్నమే యన్న?"
యని పెక్కువిధముల నడలుచునున్న - తనతల్లి నూరార్చి తలఁ పెల్లఁ దెలిపి,
"ఏమిటి కీమాట? లింత శోకింప - నేమిటి" కని రాముఁ డేర్పడఁ బలికె.470
“బలువిడి తమతండ్రి పనుపునఁ దొల్లి - చలమునఁ దమతల్లిఁ జంపె భార్గవుఁడు.
తరగని కినుకమైఁ దమతండ్రి పనుప - సరగున నొకగోవుఁ జంపెఁ గుండినుఁడు
తనమనోహరమైన తారుణ్య మొసఁగి - తనతండ్రి ముదిమియుఁ చాల్చెఁ బూరుండు.
తమతండ్రి పనుపునఁ ద్రవ్వరే తొల్లి - తమకించి సగరనందను లంబునిధిని.
గడఁగి తండ్రిది పంపుఁ గైకొని నాకు - నడవుల నుండుట యది యెంత పెద్ద!
నీవల్లభునిమాట నీకును నాకు - భావించి సేయుట పరమధర్మంబు.
ఈలక్ష్మణుఁడు బాలుఁ డేమియు నెఱుఁగఁ - జాలఁడు వీరవిచారంబె కాని”
యని నవ్వుచును రాముఁ డనుజన్ముఁ జూచి - తనలోన శాంతమంతయుఁ దోఁపఁ బలికె.
“నీవిక్రమంబును నీభుజాబలము - నీవిలువిద్యయు నీదుబుద్ధియును
నీమగతనమును నేటికి నకట! - సౌమిత్రి నాయెడ సద్భక్తి కిదియె480
యెంత సాహసము నీ విపుడు కోరితివి? ఎంతటిబుద్ధి నా కీవు చెప్పితివి?

శ్రీరాములు కౌసల్య నూరార్చుట

కొనకొని యిటు వేఁడుకొన్నది తల్లి; - యనుకంప లేక పొమ్మన్నాఁడు తండ్రి.
యిల యెల్లఁ జేకొని యీరాజ్యపదము - నలి నేలువాఁ డిఁక నాసహోదరుఁడు.
బలువిడి యెవ్వరిపై నల్గె దీవు - బలగర్వములు చూపఁ బాడియే నీకు?
నర్మిలి తండ్రివాక్యము సేయుకంటే - ధర్మంబు గలదె? యీతండ్రివాక్యంబు
త్రోయుటకంటెను దురితంబు గలదె? - వేయువిధంబుల వెదకి చూచినను
జనకుని పను పవశ్యము నీకు నాకు - జనకులకును జేయ సహజధర్మంబు.
గాన నాతనిపంపు గైకొని నేను - కానల కేగుట కాదనవలదు.
పరమపావనులైన భానువంశజుల - చరితంబు నీకు విచారింపవలదె?
కావలసినపనుల్ గాకేలమాను? దైవయత్నము లివి దాఁటంగఁ దరమె?"490
యనిన లక్ష్మణుఁ డప్పు డాటోప ముడిగి - తనరఘురాముని తలఁపెల్ల నెఱిఁగి
జడిసి యూరక యుండె; సాధ్వి కౌసల్య - కొడుకుతెంపునకు మిక్కుట మైనవగలఁ
బొగులుచుఁ గళలచేఁ బున్నమచంద్రు - దెగడు రాముని మోము దృష్టించి మఱియు