పుట:Ranganatha Ramayanamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యభిషేకవిఘ్నవృత్తాంతంబు దెలిసి - సభికులు రాజులు సచివులు సకల
పౌరులు శోకింపఁ బాదచారమున - చారుచామరసితచ్ఛత్రముల్ మాని
యనురాగ మందుచు నంత రాఘవుఁడు - తననగరికి వచ్చి తగవొప్ప మెఱసి
యంతఃపురంబున కరుగుచో సీత - యింతులు దానును నెదురేగుదెంచి
తనుఁ జూచి మది విన్నదనముఁ గైకొన్న - ఘనుని రాఘవుఁ జూచి కడుఁ జిన్నవోయి
“యిది యేమి? నాప్రాణహృదయేశ! నీకు - వదనాంబుజము కడు వాడు పాఱినది?
గట్టిగాఁ బుష్యయోగము దప్పకుండఁ - బట్టంబు గట్టెనే పార్థివేశ్వరుఁడు,
సోమమండలముతో జోడగు గొడుగు - నీమోముదమ్మికి నీడుగా దేల?
చామరద్వయము పార్శ్వంబులఁ దనరి - యేమొకో మనపట్టపేనుంగు రాదు?
శ్రీరామ! నీమౌళి సేసఁబ్రా లెవ్వి - పౌరులు నినుఁ గొల్చి బలిసి రారేల?
దుందుభీపటహాదితూర్యఘోషములు - వందిమాగధుల కైవారంబు లెవ్వి?
యభిషేకదినము నేఁ డధిప! నీయందు - శుభరాజచిహ్నముల్ చూడంగ లేవు.
సౌమిత్రిమోమునఁ జాల దుల్లాస - మేమిచందమొ? నాకు నెఱిఁగింపుఁ డిప్పు"
డని పల్కుసీతముగ్ధాలాపములకు - మనమునఁ గుంది యామానినిఁ జూచి540
“మునులకు నృపచిహ్నముల గొడ వేల - విను మది యెట్లన్న వివరింతు నీకుఁ
గైక మాతండ్రి సత్కారించి తొల్లి - గైకొన్నవరములు కాంక్షించి నేఁడు
కొడుకుఁ బట్టముఁ గట్టుకొని రాజ్య మేల - నడవుల నన్నుండ నడిగెఁ గావునను
ధరణి పాలింప నాతమ్ముని భరతుఁ - గరమొప్పఁ బట్టంబుఁ గట్టెద ననియె
పనివడి యడవులఁ బదునాలుగేండ్లు - జనకుశాసన మేను జరియింపవలసెఁ
దల్లిదండ్రులమాట తప్పక సేయు - బల్లిదునకును సంపదయును గీర్తి
నాకలోకాదినానావిధపుణ్య - లోకంబు లరచేతిలో నుండుఁ గానఁ

శ్రీరాముఁడు సీతతో తనయభిషేకభంగ మెఱిఁగించుట

గావునఁ బతియాజ్ఞ కానల సలిపి - యే వచ్చునందాఁక నిందీవరాక్షి
గురువుల వగలచేఁ గుందక యుండఁ - బరిచర్య లొనరించి భక్తితోఁ గొలువు
చిత్తంబులోన నాసేమంబు గోరు - ముత్తమశీలవై యుచితధర్మములు
వనిత! యమ్మలమ్రోల వర్తింపు" మనిన - జనకజ యారామచంద్రునిఁ జూచి
కదలినమతిఁ బ్రీతి గాలిచేఁ గదలు - కదళిచందంబున గడగడ వణఁకి550
బెదరి డగ్గుత్తికఁ బెట్టి పెన్వగలఁ - జెదరి యంతంతకుఁ జెలువేది పలికె.
"ఇదియె నిశ్చయ మైన నేను మీవెంట - వదలక పయనమై వత్తు నీక్షణమె,
నినుఁ బాసి యే నిల్వనేరఁ బ్రాణములు - ననుఁబట్టనేరవు నా ప్రాణనాథ!
యడవుల కేనును నర్థితో వత్తుఁ - దోడుక పొ" మ్మనఁ దూలి రాఘవుఁడు
"కమలాక్షి! యడవులఁ గందమూలములు - నమలి రానేలల నడచుచు నీవు