పుట:Ranganatha Ramayanamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారల రావించి వారిదనినద - చారుగంభీరసుస్వరమునఁ బలికె
“మాపెద్ద లిక్ష్వాకుమనుజేశముఖ్యు - లీపృథివీతల మేలి రిం పెసఁగ
వారలరీతి నవారితనీతి - నీరాజ్య మంతయు నే నోపినట్లు
నిజకులాగతధర్మనిరతుండ నగుచుఁ - బ్రజల నేలితిని మీప్రాపునఁ జేసి
యిది యంతయును మీర లెఱిఁగినయదియ - విదితంబుగా నింక వినుఁ డొక్కమాట.
నఱువదివేలేఁడు లవనిఁ బాలించి - నెఱసి తచ్ఛత్రంబునీడనే యుండి
ముదిసితి భూభారమునకంటె ఘనతఁ - బొదలు జరాభారమును దాల్చుకతన
నామేను వికసితనలినషండంబు - కౌముదితోఁ బోరి గర్వంబు దక్కెఁ30
గావున నారాముఁ గల్యాణరాము - దేవతాహితకాము ధీగుణస్తోము
నిందీవరశ్యాము నినకోటిధాము - సౌందర్యజితకాము జగదభిరాముఁ
బ్రజలఁ బాలింపఁగఁ బట్టంబు గట్టి - సుజనులు గొనియాడ సుఖకరంబైన
యూరట గోరుచు నున్నాఁడ మీకు - నీరీతి సమ్మతియే” యంచుఁ బలుక
ఘనగర్జితంబు లాకర్ణించి యలరు - వనమయూరము లన వా రుత్సహించి
మొగిఁ గలకలశబ్దముఖరితస్వాంతు - లగుచు భూసురముఖ్యు లగుభూమిప్రజలు
దమలోనఁ దాము మంతన మాడి కూడి - కమలాప్తకులున కుత్కంఠత ననిరి.
"మీ రాన తిచ్చిన మేలిమిమాట - వారు వీ రన కెల్లవారికి హితము
హృదయరంజకము నభీష్టదం బయ్యె - నదిగాక సకలజనానందకరము
రాజనీతిజ్ఞు నిర్మలధర్మనిపుణుఁ - దేజోజగద్భంధు దీనైకసింధు40
సత్యసంపన్నుఁ బ్రశాంతిసంపన్ను - నిత్యవిప్రార్చనానిరతు సచ్చరితు
నీతియుఁ బ్రీతియు నేర్పును నోర్పు - ఖ్యాతియు భూతియుఁ గాంతియు దాంతి
శాంతియు మొదలగు సద్గుణావళుల - నెంతయు నీకన్న నెక్కుడై యున్న
రాముని లోకాభిరాముని నీవు - భూమికి రాజుగాఁ బూన్చుట తగదె?
త్రైలోక్య మైన నాతం డేలఁజాలు - నీలోక మేలుట యెంతమాత్రంబు?
నీసుతాగ్రణి రాజ్యనిరతుఁ డౌనేని - భూపతి చేసిన పుణ్యంబు గాదె?
కావునఁ బట్టంబు గట్టు మీ వతని - కేవేళ మేమును నిదియె కోరుదుము.”
ఆనుచు బద్ధాంజలు లై విన్నవింప - విని తనమదిలోన వేడ్క రెట్టింప
భూమీశుఁ డప్పు డుప్పొంగి వసిష్ఠ - వామదేవులఁ జూచి వలనొప్పఁ బలికె
"నీమధుమాస మభీష్టదం బగుట - రాముని సకలసామ్రాజ్యలక్ష్మికిని50
రాజుఁ జేయుదము తర్ద్రవ్యవస్తువులు - యోచించి తెప్పింపుఁ డుచితవైఖరిని”
నని పల్క వారు నయ్యభిషేకయోగ్య - ఘనవస్తువులు గూర్పఁగాఁ బంచి రంత.
క్ష్మావల్లభుండు సుమంత్రాదిమంత్రి - కోవిదులను బంధుకోటి వేర్వేఱ
రావించి చెప్ప వారలు సమ్మతించి - వేవేగ రఘురామవిభుని రప్పించి