పుట:Ranganatha Ramayanamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీరంగనాథరామాయణము

అయోధ్యాకాండము



దశరథుఁడు ప్రజలతోఁ దనకోర్కిఁ దెల్పుట

శ్రీలీల దశరథోర్వీపాలుఁ డవని - బాలించుచుండి చొప్పడ నొక్కనాఁడు
సుతులు నల్వురలోన శుభతరమూర్తి - యతులయశోనిధి యగుచున్నవాని
ననుదినంబును పేద లగువారినెల్ల - మనమున ముద మంద మన్నించువాని
హితబుద్ధి యగువాని నెల్లభూతముల - హితమునఁ గరుణ నన్వేషించువానిఁ
బోల జతుర్విధపురుషార్థగతుల - నోలి చిత్తంబున నూహించువాని
ననిశంబు సంతుష్టుఁడై యుండువానిఁ - గొనియాఁడదగినసద్గుణములవాని
దప్పనికోపంబు దగుప్రసాదంబు - నొప్పగు ప్రభుశక్తి నొనరెడువాని
గజహయారోహణక్షముఁ డగువాని - విజయలక్ష్మీసమన్వితుఁ డగువాని
వెరవరి యగువాని విహితకార్యంబు - నరయ ననాలస్యుఁడై చేయువాని
మానని రోషంబు మది లేనివాని - మానుగా భృత్యుల మన్నించువాని10
నతిరథుఁ డగువాని ననసూయవృత్తిఁ - బ్రతిదినంబున బుద్ధిఁ బాటించువానిఁ
గరుణాసముద్రుఁడై కడుమించువాని - బరులగుణంబులు పాటించువాని
బుద్ధి బృహస్పతిఁ బురణించువాని - నిద్ధతేజంబున నినుఁ బోలువాని
నమితప్రజానంద మలరించువాని - గుముదబాంధవుభంగిఁ గొమరొందువాని
వెలయ ధనుర్వేదవేదశాస్త్రములు - వలయు విద్యలయందు వలనొప్పవాని
న్యాయమార్గంబున నర్థార్జనంబు - పాయక సేయ నేర్పఱి యగువాని
సైరణ ధరతోడ సరివచ్చువాని - భూరిగుణంబులఁ బొలుపొందువాని
శ్రీరాము పట్టాభిషేకంబు చేసి - ధారణిఁ బాలింపఁ దలపోసి యంతఁ
దలకొన్నకడకతో దశరథేశ్వరుఁడు . కొలువుకూటమునకుఁ గొమరొప్ప వచ్చి

దశరథుఁడు వసిష్ఠాదులతో రామునకుఁ బట్టముఁ గట్ట నాలోచించుట

యందు వసిష్ఠాదు లగు మహామునులు - నందు సుమంత్రాదు లగు మంత్రివరులు20
చేరువ నృపతులుఁ జెలులుఁ జుట్టములు - పౌరవర్యులు జానపదులు నాశ్రితులు
సారవివేకులు సామంతనృపులు - ధీరులు రాజనీతిజ్ఞులు మొదలు