పుట:Ranganatha Ramayanamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశరథుఁడు శ్రీరాముని రాజ్యపాలనముఁ బూనుమని చెప్పుట

తనచూపులను సుధాధారలు దొరుగ - జననాథుఁ డారామచంద్రుతో ననియె.
“బెనుపొందఁ గడిమిమైఁ బెద్దకాలంబు - జను లెల్లఁ బొగడ రాజ్యము చేసి యేను
దానముల్ ధర్మముల్ తనరుయాగములు - నూనిననిష్ఠతో నొగిఁ బెక్కు చేసి
కడపట నీయట్టి కల్యాణశీలుఁ - గొడుకుగాఁ బడసితిఁ గోర్కి రెట్టింప
నే నింక భూభార మిట మోయఁజాల - గాన నిన్ బట్టంబు గట్టెదఁ బ్రీతి
చెలువార పట్టాభిషేకంబు సేయ - లలితపుణ్యోదయలగ్న మెల్లుండి60
యొనర సీతయు నీవు నుపవాస ముండుఁ - డెనసినభక్తితో నెల్లసంప్రీతి."
నని పల్కుటయు రాముఁ డవనీశుఁ జూచి - వినయంబు ధైర్యంబు వెలయ నిట్లనియె.
“జననాథ! నాకు నీచరణపద్మములు - గొనకొన్నభక్తితోఁ గొలుచుటకంటె
గడచినరాజ్యంబు గలదె లోకముల? - నుడుగు మీపలుకు లయోగ్యంబు" లనుడు
ననఘచారిత్రుఁడ వతిసత్త్వధనుఁడ - వినకులరత్నంబ వీ వుండ నింకఁ
దగువార లెవ్వరు? ధరణిపాలనముఁ - దగిలి కావింపుము త్రైలోక్యవీర!”
యని పల్కుటయు రాముఁ “డట్లకా” కనుచుఁ - దననగరికిఁ బోయెఁ దదనంతరంబ.
పౌరుల రాజుల బంధుల నెల్ల - వారల వీడ్కొని వనజాప్తకులుఁడు
అంతఃపురంబున కరిగి శ్రీరాము - చెంత నున్న సుమంతుచేఁ బిలిపించి
తనసమీపమున నాతనయుఁ గూర్చుండఁ - బనిచి యానందబాష్పము లుప్పతిల్ల70
మన మలరఁగఁ జూడ మహిపున కపుడు - మనమున దిగులొత్త మఱి యశుభములు
కనుపట్టె నంతటఁ గడుభయ మంది - తనపుత్త్రకునిఁ జూచి తద్దయుఁ బలికె.
“నాపాలిభాగ్యంబ నానిధానంబ - నాపుణ్యసారంబ నాతపఃఫలమ
నాపుత్రరత్నంబ నాకలలందు - దీపించె నశుభవర్ధితనిమిత్తములు
ఘనదుర్గ్రహములు నుల్కాపాతములును - గనుఁగొంటి మనసు వైకల్యంబు నొందెఁ;
గావునఁ బుష్యయోగము నీకు లెస్స - నీవు పట్టముఁ బూన నిండు నాకోర్కి
యాలస్య మేల నీయభ్యుదయమున - కీలోకమంతయు నెపుడుఁ గాంక్షించు”
నన విని దశరథు నానతి యియ్య - కొని మ్రొక్కి తండ్రి వీడ్కొని రామవిభుఁడు
తన తల్లికిని సుమిత్రకు నట్టివార్త - జనకనందనకు లక్ష్మణునకుఁ జెప్పి
వారల సంతోషవార్ధిఁ దేలించి - యారామవిభుఁడు శీతాంశుసన్నిభుఁడు80
తననగరికి వచ్చెఁ దాను సీతయును - ఘనమైనహృదయవికాసంబు నొంద
నంత వసిష్ఠుతో ననియె భూవిభుఁడు; - "సంతోష మెసఁగంగఁ జని రామవిభుని
మునినాథ యుపవాసమునకు సంకల్ప - మొనరింపఁజేయుము యుక్తమార్గమున"
ననవుడు బ్రహ్మరథారూఢుఁ డగుచుఁ - జని వసిష్ఠుఁడు రామచంద్రునికడకుఁ
దనశిష్యు నొక్కనిఁ దడయక పనిపి - తనరాక మున్నుగాఁ దగ నెఱిఁగించి