పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము


రాజశేఖరుఁడుగారి బీదతనము__సుబ్బమ్మ మరణము__బంధు మిత్రుల ప్రవర్తనము__రాజమహేంద్రవర ప్రయాణము__గ్రహణ స్నానము.

పూర్వము పుస్తకములయందు__శ్లో॥ ఆధివ్యాధి శతైర్జనన్య వివిధై రారోగ్యమున్మూల్యతే లక్ష్మీర్యత్ర పతంతితత్ర వివృత ద్వారా ఇవ వ్యాపద:॥ ఇత్యాదులగు ధనమే యాపదకెల్లను మూల మని బోధించు వచనములను జదువునపుడు పురాణవైరాగ్యముగలిగి రాజశేఖరుడుగారు దారిద్ర్యమును గోరుచు వచ్చిరి. లక్ష్మీవలెఁ గాక యామె యప్పయైన పెద్దమ్మవా రిప్పుడు నాశ్రిత సులభురాలు గనుక, అతని కోరికప్రకారము దారిద్ర దేవత వెంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింపఁజేసినది కాని తాను మునుపనుకొన్న రీతిని పేదఱిక మాతని కంత సుఖకరమయినదిగాఁ గనుపించలేదు. ఇప్పుడు మునుపటివలె నిచ్చుటకు ధనము లేకపోయినది గనుక, ఈవఱకు నాతని నింద్రుఁడవు చంద్రుఁడవని పొగడుచు వచ్చిన స్తుతిపాఠకు లందఱును మెల్లమెల్లగా నాతనిని విడిచిపెట్టి, ఆతనివలన ధనికులయు బాగుపడినవారియొద్దకుఁ పోసాగిరి, అయినను రాజశేఖరుఁడుగారు చేయి చాచి యాచించినవారి నూరక పొమ్మనలేక నోటితో లేదనునది చేతి తోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగినవారికి భోజనము పెట్టుచుండిరి.అందుచేత నతిథి యెంతబీదవాఁ డయిన నంత సంతోషించుచుండునే కాని మునుపటివలె విందులకు విజయం చేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దాన ధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాబట్టి ఇంటఁగల యిత్తడి సామానులను కుదువబెట్టి రాజశేఖరుఁడుగారు