పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సొమ్ము తెచ్చుచుండిరి. అందుచే నానాటికి గృహమునఁగల సొత్తు తక్కువయి కాపాడవలసిన భారము తగ్గుచుండెను. ఇట్లు కొంత కాలము జరగఁగా నించుమించుగా నింటఁగల జంగమ రూపమయిన సొత్తంతయు బుట్టలను, తట్టలును కొయ్యలునుగా మా ఱఁజొచ్చెను. అప్పుడు సహిత మాతఁడు యాచించినప్పుడు లేదని యెవ్వరి మనసు లకును నొప్పి కలుగజేయ నిష్టములేనివాఁడయి, మున్నెప్పడు నసత్యమన్నమాట నెఱుఁగనివాఁడయినను దరిద్రత్వ దేవత యొక్కయుపదేశముచేత ధనదానములకు బదులుగా వాగ్దానములను మాత్రమే చేయనారంభించెను. ఆహా! మనుష్యులచేత దుష్కార్యములనుఁ జేయించుటలో దారిద్ర్యమును మించినది మఱియొకటి లేదుగదా? ఆతఁ డీ ప్రకారముగా సర్వవిధములచేతను బాధపడుచున్నను, ఆ సంగతి నొరు లెఱుఁగకుండుటకయి భోజన పదార్థములలోఁ దక్కువ చేసియైన మంచి బట్టలను గట్టుకొనుచు అప్పుచేసియైనను బీదసాదల కిచ్చుచుఁ బయి కొకరీతి వేషముతోఁ బ్రవర్తించుచుండెను. ఆది యేమి మాయయో కాని లోకములో నెల్లవారును తాము సుఖపడుట కయి వహించుదానికంటెఁ దాము సుఖము ననుభవించుచున్నట్టిత రులకుఁ దోచునట్లు చేయుటకయియే విశేష శ్రద్ధను వహిం తురు, బీదతనమువలనఁ గలుగు సౌఖ్యములను లాభములను వేదాంత గ్రంథములు వర్ణించి చెప్పుచు ధనము పాపమునకుఁ గుదురని దూషింపుచున్నను, రాజశేఖరుఁడుగారు మాత్రము మనల నీదారిద్ర్యదేవత యెప్పుడువదలునా యని నిమిషమొక యొగముగాc గడపుచుండిరి; కాబట్టి యాతఁ డింత వఱకును లక్ష్యముతోఁ జూడని యదృష్టదేవత నిప్పుడు మఱి మఱి ప్రార్ధింపసాగెను. దాని నాతఁ డెంతయాసపడి వేఁడుచు వచ్చెనో యాయదృష్టదేవతయు నంతదూర ముగాఁ దొలఁగ నారంభించెను.

అట్టి సమయములోనే సుబ్బమ్మకు రోగము తిరుగఁబెట్టినది. డబ్బులేక యిబ్బంది పడుచున్న సమయములోనే యుపవాసమును నుప్పిడులను చేసి దినమున కిరువదిస్నానములుచేసి తడిబట్టలు కట్టు