పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననియు, తన గురువా విద్యను తన కుపదేశించెను గాని మంత్రము యొక్క పునశ్చరణము పూర్తికానందునఁ దనకది యింకను ఫలింప లేదనియు, తా నిప్పుడు పసరులతో మాత్రమే బంగారమును జేయఁ గలననియు, రాజశేఖరుఁడుగారిమీఁది యనుగ్రహముచేతనే చెప్పినట్టు చెప్పి, ఎల్లవారును దన్ను బంగారము చేయమని బాధింతురుగాన ఆ సంగతిని మహారహస్యముగా నుంచవలెనని కోరెను.రాజశేఖరుఁడు గారు తా నా ప్రకారము గోప్యముగా నుంచెదనని ప్రమాణముచేసి తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుఁడని బహువిధముల వానిని బ్రార్ధించిరి. దానిపయిని ఆ బైరాగి యది గృహస్థులు చేయఁగూడ దనియు, చేసినయెడల వంశ క్షయ మగుననియుఁ జెప్పి తనయెడల విశ్వాసముగలవారికి తానే బంగారమును జేసి యిచ్చెదనుగాని యోగ మును మాత్రము చెప్పనని చెప్పెను.

అందుమీఁద బంగారమునైనఁ జేయించుకోవలెనను నాశ పుట్టి మఱింత శ్రద్ధాభక్తులతో నాతని నాశ్రయించుచు నొకనాఁటి యుదయకాలమున రాజశేఖరుఁడుగారు పాలును శర్కరయుఁ దీసికొని వచ్చి యిచ్చి కూరుచుండియుండఁగా, ఆ బైరాగి రాజశేఖరుఁడుగారి మీఁదఁ దనకుఁ బరిపూర్ణానుగ్రహము గలిగినట్టు ముఖచిహ్నముల వలనఁ గనఁబఱచుచు నొక బేడయెత్తు బంగారమును బేడయెత్తు వెండిని దెమ్మని యడిగి యాతడు తెచ్చి యిచ్చిన తరువాత వానిని రెంటిని నొక గుడ్డలో కట్టి రాజశేఖరుఁడుగారు చూచుచుండగా నిప్పులలో వేసి కొంతసేపుండనిచ్చి యొక పసరును దానిమీద పిండి కొంచెముసేపు తాళి పట్టుకారుతో దీసి రెండుబేడాల యెత్తు బంగారమును చేతులో బెట్టెను. అందుమీద రాజశేఖరుడుగారు మఱింత వెండిని గలిపి యేకముగా బంగారమును జేసి పెట్టుఁడని వానిని బహువిధముల వేడుకొనిరి. అట్లు వేడుకోగా వేడుకోగా గోసాయి యాతని ప్రార్ధన నంగీకరించి యింటఁగల బంగారమును వెండినిఁ జేర్చి యొకమూటగట్ట నియమించెను. ఆతని యాజ్ఞాను సారముగా రాజశేఖరుఁడుగారు తమయింటఁ గలవారి నగలును వెండి