పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకు జనుపనార త్రాడును గట్టి, క్రొత్తబట్టలో గొంతముక్కను జించి వానికిఁ గొంచెము కొంచెము దూరముగా బొమ్మరాళ్ళను ముడి వైచి గుడ్డను దిట్టముగా నేతిలో ముంచి యొకకొనను జనుపనార త్రాడుకు వ్రేలాడఁగట్టి, దానికి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెము నిండ నీళ్ళుపోసి నీళ్ళలో పువ్వులను చక్కఁగా బఱచి, ఆ గుడ్డ కొనను దీపమంటించి హరిశాస్త్రులు వెలుపలికి వచ్చెను. ఆతఁ డీవలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డయంటు కొనఁగా మండుచుండెడు చమురుబొట్లు నీటిలోఁబడి టప్పుమని మను ష్యునిమీఁద దెబ్బ వేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మ రాళ్ళవఱకును కాలినప్పు డారాయి యూడి నీళ్ళలోఁబడి గొప్ప ధ్వనిని జేయుచు వచ్చెనుగాని పళ్ళెములో నడుగునఁ బువ్వలుంటచేత నిత్తడి పళ్ళెముమీఁద వాయించినట్టెంతమాత్రము వినఁబడినదికాదు. ఆ గుడ్డయంతయు మండిపోయినతరువాత ఆతఁడు లోపలికిఁ బోయి మసి మొదలగు వానిని పూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను.

రాజశేఖరుఁడుగారు సువర్ణవిద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బైరాగికి సమస్తోపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపెట్టి యనుసరించుచు, ఆతఁ డొకనాఁడు గంజాయి త్రాగి యుల్లాసముగాఁ గూరుచున్నపుడు చేరబోయి వినయముతో "బావాజీ: లోకములో సువర్ణము చేయు విద్య యున్నదా?" అని యడిగెను. అతఁడు మందహాసము చేసి "ఉన్నది" అని చెప్పెను. ఆ పయిని మాటల ధోరణిని "ఆ విద్యయొక్క సంగతి యెటువంటి" దని రాజశేఖరుడుగారు మహాభక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకొని యడిగిరి. అందుమీఁద నతఁడు “ఆ సంగతి పరమరహస్యమయినను నీకు జెప్పెద" నని పూర్వయుగములలో స్పర్శవేదివలన నినుము బంగారమగుచు వచ్చెనుగాని యీ కలియుగములో స్పర్శవేది లేద నియు, పూర్వము శంకరాచార్యులవా రొక యూఁడిగవానికి సువర్ణ ముఖి యను విద్య నుపదేశింపఁగా వాఁడు చిరకాలము బంగారమును జేసి కడపట యోగులలోఁ గలసి వారి కుపదేశించి దేహము చాలించె