పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట్లు కనఁబడి తాను రుక్మిణి పెనిమిటినని బయలపడి, కాని దేశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని యేడ్చుటయే కాక తాను రుక్మిణిమీఁది మోహముచేతఁ వచ్చితిననియు, ఆమెను దనయొద్దకుఁ దీసికొనిపోయెదననియుఁ జెప్పెను. ఆ సంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయుఁగూడ నేడువసాగిరి. ఆ యుద్రేకము శాంతి పొందిన పిమ్మట వారా మాలదానికి సమర్పింపవలసినదాని నర్పించి యింటిఁ బోయిరి. రుక్మిణకిని రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొనునప్పడును మగఁ డెదుటఁ గనఁబడు చుండెను. ఒకానొకప్పుడు మాటాడునట్లు నహిత మామెకు వినఁ బడుచువచ్చెనుగాని యా మాటల నామె గ్రహింపఁ గలిగినదికాదు. ఆమె యొకానొకప్పు డెవ్వరో గుండెలమీఁద నెక్కి కూరుచున్నట్లు తలఁచి నిద్రలోఁ గేకలు వేయుచుండును.

ఇట్లుండఁగా నొకనాఁడు హరిశాస్త్రులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణిచేయి చూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను. బైరాగిచేత విభూతి పెట్టించి లోపలికి తీర్థమిప్పించిరి కాని, అందువలన రుక్మిణి కేమియు గుణమగపడలేదు. ఒకనాఁ డొక బుడబుడక్కలవాఁడు నెత్తిమీఁది తలగుడ్డలోఁ బక్షియీఁక లను బుజముమీఁద వేపఔత్తముల కట్టయు, వీపన బెత్తము లకు వేలాడఁ గట్టిన పెద్దతోలునంచియు నుండ డక్క వాయించుచు వచ్చి మాణిక్యాంబ శకున మడిగినప్పడు గీతలను బొమ్మ లను వేసియున్న తాటాకుల పుస్తకము చూచి తీర్ధమునకు వెళ్ళిన దినమున రావిచెట్లమీదనుండి వచ్చి యొక కామినీగ్రహము సోఁకిన దనియు దిగఁదుడుపు పెట్టినఁ బోవుననియుఁ జెప్పి యొక వేరు ముక్క యిచ్చి దానిని వెండి తాయెతులోఁ బెట్టి దండచేతికిఁ గట్టు మనిచెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా మాణిక్యాంబ రుక్మిణికి దిగఁదుడుపు పెట్టెనుగాని యందు వలనను గార్య మగపడలేదు. ఒక దినమున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలఁబడి యదియంతయుఁ దన