పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పులుసు, కంద, పనస మాత్రము తగులఁగూడదని పథ్యమును విధించి, ప్రతిదినమును రెండు పర్యాయములు వచ్చి చేయి చూచి గుణమును కట్టుకొని పోవుచుండును. మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్థపడ నారంభించినది కాని తరువాత రాత్రులు పలువరింతలు పట్టి జ్వర మధికము కాసాగెను. అప్పుడు వైద్యుని బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా, అతఁడు "రేవత్యా మనురాధాయాం జ్వలో బహుదినంభవేత్" అని చదివి యీ జ్వరము రేవతీ నక్షత్రమున వచ్చినదికాన బహుదినము లకుఁ గాని పోదని చెప్పెను. కాని యాతని మాటలయం దంతగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మఱియొక వైద్యునిఁ బిలి పించి, రాజశేఖరుడుగారు రుక్మిణిని జూపించిరి. అతడు చేయి చూచి పైత్యజ్వర మని చెప్పి, మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్చవచనములు పలికి, ఆతనియొద్ద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుక ప్రకారముగా "లంఘనమ్ పరమౌషధ'మన్న యొక్క సూత్రముననే శరణముగావించుకొని లంక ణములు కట్టనారంభించెను. అతఁడు నవజ్వరపక్వము కావలెనని పలుకు చున్నను లక్ష్యచేయక, దినదినక్రమమున రుక్మిణి శుష్కించి యంత కంతకు మఱింత బలహీనురాలగుచుండుట చూచి యాతని వైద్య మును మానిపించి, మరల మొదటివైద్యునినే రావింపఁగా నతఁడు వెంటనే పథ్యము పెట్టించి యౌషధ సేవ చేయింప నారంభించెను. ఆ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము పట్టినను, ఒక పట్టున నిశ్శేషమయినదికాదు.

ఈలోపల మాణిక్యాంబ యొక యాదివారమునాఁడు నాలుగు గడియలకుఁ దెల్లవాఱుననఁగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టుకొని యెవ్వరును వెళ్ళకముందే ముందుగా దాము వెళ్ళవలెనని బయలుదేఱి కొమార్తెమీఁది ప్రేమచేతఁ దాను స్వయముగానే కోరలమ్మగుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆ గుడియొద్ద నున్న మాలది మాణిక్యాంబ ధూపము వేసినమీఁదట నిష్టదేవత తన కావేశమయి