పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందు నలుగురిలోఁ దలయెత్తుకొని తిరుగుటకు నోచుకోక పోఁగా, మొగ మగపడినమాత్రముగ మీఁదిమిక్కిలి యెల్ల వారును దుశ్శకునమని దూషింతురు. ఈ హేతువుచేతనే "విధవ" యను మాటయే వినుటకు శూలమువలెఁ గర్ణ కఠోరముగా నుండును; ఎవ్వనినైన "విధవా" యను పేరను బిలిచిన మాత్రమున ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాఁడు మండిపడును.

ఈ స్థితి యంతయు కన్నులకు గట్టినట్లగపడి, ఆ వర్తమానము తెలిసినదినము మొదలుకొని రుక్మిణి రాత్రియుఁ బగలును గదిలోనుండి వెలుపలికిరాక నిద్రాహారములు మాని మగనికయి శోకించుచు గృశింపసాగెను.విచారమునకుఁ దోడు దేహమున నేదియో వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వఱకును వ్యాధి సంగతిని నెవ్వరును కనుగొన్నవారు కారు. కను గొన్నతోడనే రాజశేఖరుఁడుగారు ఘనవైద్యుఁడని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించి చేయి చూపించిరి. అతఁడు రుక్మిణి పరున్న మంచముమీఁదఁ గూరుచుండి యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదని చెప్పి యామెకుఁ బెక్కు దినములనుండి శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనకపోవుటచేత జ్వరము దేహములో జీర్ణించిన దనియుఁ జెప్పి వైద్య గ్రంథమునుండి-శ్లో॥ పారాదార్వి మహాబలా త్రికటుకాజాజీర సో నాస్త్రధా! విష్ణుక్రాంతసినాడికా గృహభవోధూమ స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వకృత్ర నిర్గండికా భార్టీ పక్వ పటచ్చదాచ్చ సకలాన్ శీతజ్వరాన్నాశయేత్ -అను శ్లోకమును జదివి, తెప్పింపవలసిన వస్తువుల నొక కాగి తముమీఁద వ్రాయించి యప్పటి కింటికిఁ బోయెను. ఆ మధ్యాహ్నమునకే రాజశేఖరుఁడుగారు వస్తువుల నన్నిటిని డెప్పించి వైద్యు నకు వర్తమానము నంపినందున, అతఁడువచ్చి వస్తువులను చూర్ణము చేయించి పొట్లములు కట్టి, తేనె యనుపానముచేసి మూడు వేళలను మూడు పొట్లము లిమ్మని చెప్పి, నూనె, గుమ్మడి, బచ్చలి,