పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చి కారణంబును దెలిసికొని పలుతెఱంగుల విలపించిరి. అప్పు డక్కడనున్న పెద్దలందఱును వారి నోదార్చి వారిచే స్నానములు చేయించి వేదాంత వచనముల నుపదేశింపసాగిరి. ఇట్లు కొన్ని దిన ములు జరిగిన తరువాత బంధువులు మొదలగువారు రుక్మిణికి శిరోజములు తీయించు విషయమయి రాజశేఖరుఁడుగారితోఁ బ్రసంగించిరి గాని, ఆయన కొమార్తెమీది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, నందఱును గూడ దానివలన నొక బాధకము లేదనిచెప్పి యాయన చెప్పినవిధమే మంచిదని యొప్పుకొనిరి.

మన దేశములో పతిరహితులగు యువతుల దురవస్థను తలఁచుకొన్న మాత్రమున పగవారికయినను మనస్సు కలుక్కుమనక మానదు. పతిశోకమును మఱచునట్లు చేసి యాదరింప వలసిన తలి దండ్రులే జీవితేశ్వరులు పోయి దు:ఖసముద్రములో మునిఁగియున్న తమకడుపున బుట్టిన కొమార్తెలను కరుణమాలి సమస్తాలంకారముల కును దూరురాండ్రనుజేసి, తలగొణిగించి కురూపిణులజేసి ముసుగు వేసి మూల గూర్చుండఁబెట్టదురు; రెండుపూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి యందఱి భోజనములు నయిన తరువాత మూడుజాముల కిన్ని మెతుకులు వేయుదురు; మనసయినను మంచిబట్ట కట్టుకోనియ్యక, అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తరు. వేయేల? మగఁడుపోయిన వారిజీవనములనే దుఃఖభాజనముగాఁజేసి, వారిని జీవ చ్ఛనములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతుఁ డలంకారము దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాచి దువ్వి ప్రాణముతో సమానముగా పెంచుకొనుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్దయుఁడైన మంగలివాని కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే మేలని తోఁచును; ఇంటఁగల కష్టమయినట్టియు నీచమయినట్టియు పనులన్నియు వారిమీదనే పడును; పుట్టినింటఁ జేరఁగానే, వదినెలను మఱదండ్రును దాసి నిగాఁ జూతురు: గారవమను మాట యుండదు; శుభకార్యముల