పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాహత్మ్యమే యనియు, కొండకు వచ్చి తనకు నిలువుదోపి చ్చెద నని తల్లి మ్రొక్కుకొన్న పక్షమున సర్వము నివర్తియగు ననియుఁ జెప్పెను. ఆ ప్రకారమే చేసెదనని మాణిక్యాంబ మ్రొక్కు కొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టెను గాని దాని వల నను రుక్మిణి దేహస్థితి యనుకూలదశకు రాలేదు. అంతట హరిశాస్త్రులు వచ్చి యీరాత్రి చిన్నదానిచేతఁ బలికించి దయ్యమును వదలఁగొట్టె దనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు గడియల ప్రొద్దు వేళ నే వచ్చి చావడి యలికించి దానినిండ రంగు ముగ్గులతో ధైర్య శాలులయిన పురుషులు చూచినను భయపడునట్టుగా వికృతమయిన స్త్రీ విగ్రహము నొకదానిని వేసి తాను స్నానము చేసి జట్టు విరియఁ బోసికొని కుంకుమముతో మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మిణిని స్నానము చేయించి తడిబట్టతో నాపట్టనడుమఁ గూరు చుండఁబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును బిందెనాదములు మోగునట్టు మనుష్యులను నియమించి, కన్నులు మిఱుమిట్లు గొన నెదురు గొప్ప దీపములు పెట్టించి, మంచి వారికి సహితము పైత్యో ద్రేకముచేయు ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్లలోని పిల్లలందఱును జడిసికొనులాగున "హ్రాం" "హీం" అని పెద్దగొంతుకతో బీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెఱ్ఱ చేసి బెత్తము పుచ్చుకొని కొట్టఁబోయినట్టుగా రుక్మిణిమీఁదికి వెళ్ళి "ఉన్నది యున్నట్టుగాఁ జెప్పు" మని కేకవేసెను. ఆ వఱకే దేహస్మృతి తప్పి వికారముగాఁ జూచుచున్న యారుక్మిణి తల్లి సోదెకు వెళ్ళివచ్చి చెప్పిన ప్రకారముగా తాను నృసింహస్వామి ననియు భార్యమీఁది మక్కువ తీఱక వచ్చి యావహించినాఁడ ననియు, తనతోఁగూడ నామెను దీసికొనిపోయెదననియు పలికెను. అంత నాపైత్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమో రాచి యామెకు తెలివివచ్చినమీఁదట లోపలికిఁ గొనిపోయి శైత్యోప చారములు చేయుఁడని దగ్గఱ నున్నవారితోఁజెప్పి, హరిశాస్త్రులు యింటికి బోయెను.రుక్మిణి యాదినమును మఱునాఁడును బలహీన