పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహామంత్రవేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తి చేత వచ్చునను నమ్మకముతో మధ్యాహ్న మునఁ దప్పక రావలయునని పలుమారు ప్రార్థించి తీసికొని రమ్మని సిద్ధాంతితోను జెప్పెను. సిద్ధాంతియు శాస్త్రులును ముఖవిలాసముతో సల్లాపసుఖము ననుభవించుకొనుచు నింటికి నడచిరి. ఇక్కడకు వచ్చు నప్పుడే సిద్ధాంతియు శాస్త్రీయ రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుఁడుగా రిచ్చుబహుమతిలో చెఱిసగమును బుచ్చుకొనునట్లు సమాధానపడిరి. కాబట్టి రాజశేఖరుడుగారికి నమ్మ కము పుట్టించుటకయి ముందుగా చేయవలసిన తంతును కూడబలుకు కొన్న తరువాత, వస్తువును దాచినవాఁడు పళ్ళెములో బియ్యము పోయఁగానే వెనుక దాను బోసెదననియు వాఁడే దానిని తీసి దానినా డని చెప్పవలసిన దనియు సిద్ధాంతి యింటివద్దనే నిర్ణయము చేసి నందున శాస్త్రులాతని సాహాయ్యముచేత నిమిషములో నుంగరము దీసినవానిని చూపఁగలిగెను.

మధ్యాహ్న భోజనము చేసి బయలుదేఱి కావలసిన పరి కరములతో సిద్ధాంతియు హరిశాస్త్రులను రాజశేఖరుఁడుగారి యిల్లు చేరిరి. అంతకు మునుపే యింటగల పరిచారకులును తక్కినవారును రావింపఁబడిరి. హరిశాస్త్రులకు వినఁబడునట్లుగా సిద్ధాంతి రథోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో కాసుల పేరు పోయినప్పు డెవ్వరెవ్వరెచటనుండిలో యాసంగతులు వెంట వెళ్ళినవారి నడిగి తెలుసుకొనుచుండెను. అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్త్రుల చెవులో నొకమాట చెప్పి మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను. ఇంతలో రాజశేఖరుఁడుగారు వచ్చి వారినందఱికిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్త్రులు అమ్మవారి పెట్టెను తీసికొని యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేపు తాళి యిత్తడిపెట్టెను పట్టుకొని కుడిచేతికొక రాగి కడియమును దొడుగు కొని మరల వచ్చి అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని పచ్చని మ్రుగ్గులతో నొక్క విగ్రహమును చేసి, దాని నాభిస్థానమునం దాను