Jump to content

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నావఱకు పోయినవస్తువులు తెప్పించినానన్న స్థలములపట్టిక నొక దానిని బహుదినములు ప్రయాసపడి వల్లించిన వానివలె తడవుకోకుండఁ జదివెను. అప్పుడు సిద్ధాంతి రుక్మిణివస్తువు పోయినసంగతి జెప్పి దానిజాడ చెప్పవలయునని ప్రార్థించెను. తోడనే హరిశాస్త్రులు తన ముక్కుపుటములయెుద్ద వ్రేళ్ళుపెట్టుకొని చూచి,ఆకాశమువంకఁ జూడ్కి నిగిడించి వ్రేళ్ళు మణఁచి యేమో లెక్కించి నిమిషమాలోచించిపోయిన వస్తువు ఇక్కడకు వచ్చుచుఁ బోవుచు నుండు వారిచేతనే చిక్కినది కాని యిల్లు దాఁటిపోలేదని చెప్పెను.ఇంతలో రాజశేఖరుఁడుగారి ముఖ ప్రక్షాళన మయినందున నందఱుఁ గలిసి లోపలికిఁ బోయిరి. నడవలో నిలుచుండి హరిశాస్త్రులు వస్తువును దెప్పించి యిచ్చుటకు తనదే భారమనియు, మధ్యాహ్నము వచ్చి యంత్రము వేసెదను కాబట్టి యాసమయమున కింటనున్న సేవకు లందఱను సిద్ధముగా నుంచవలయు ననియుఁ జెప్పి, 'లోపలనుండి కొంచెము బియ్య మిప్పుడు తెప్పింపుడు' అని కోరెను. సిద్ధాంతియే లోపలికిఁ బోయి యొక పళ్ళెముతో బియ్యమును దీసికొనివచ్చి శాస్త్రుల కోరిక ప్రకారము గృహమునఁ గనఁబడ్డ భృత్యవర్గమును బిలుచుకొనివచ్చెను. ఆమీఁదట శాస్త్రులు తన మంత్రప్రభావమును గొంచెము చిత్తగింప వలయు నని మనవిచేసి, అక్కడనున్నవారిలో నెవ్వరైన నొక వస్తువును దీసి రహస్యముగా దాచినయెడల వారి పేరును జెప్పెద నని చెప్పి, తాను వీధిలోనికిఁ బోయెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు తన యుంగరము నొకనిచేతికిచ్చి పదిలముగా దాపించి, యాతఁడు వచ్చి కూరుచున్న తరువాత శాస్త్రులును లోపలికిఁ బిలిచి యుంగర మును దాచిన వానిని జూపమని యడిగిరి. శాస్త్రులు తోడనే యక్కడ నున్న పదిమంది చేతులలో బియ్యమును బెట్టి యొకరొకరే వచ్చి బియ్యమును పళ్ళెములో బోయవలె నని చెప్పి తా నేమో మంత్రమును జపించుచుండెను. అప్పుడందఱును వరుసగా వచ్చి బియ్యము పళ్ళెములోఁ బోసిరి. వెంటనే యతఁడుంగరమును దీసినవాఁ డీతఁడని చూపెను. అప్పు డక్కడనున్న వారందఱును నద్భుతర సాక్రాంతు లయిరి. రాజశేఖరుఁడుగారును ఆతఁడు