పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెచ్చిన యిత్తడిపెట్టెను బెట్టి మూత తీసి 'జయజననీ' యని కేకవేపి కొంతసేపేమో కన్నులు మూసికొని జపముచేసి, రాజశేఖరుఁడుగారి వంక జూచి యొక తెల్లకాగితము తెమ్మని యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తప్ప మఱియొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుఁడుగారి కుమారుఁడు లోపలికిఁ బోయి యొక తెల్ల కాగితము దీసికొనివచ్చి యిచ్చెను. అప్పడా కాగితము నందఱును జూచుచుండగా సమానములైన యెనిమిది ముక్కలనుగాఁ జించి యందొక్క ముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన యేడు ముక్కలను వారి కిచ్చివేసి, తా నుపాసించు దేవత యొక్క శక్తిచేత ఆ కాగితపు ముక్క-మీఁదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను ఇత్తడిపెట్టెలోఁ బెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యా ముక్కను మరలఁ బయికిఁ దీసి తన చేతి లోనే పట్టుకొని యందఱకును జూపి, దానిని క్రిందనునిచి మూలలను కుంకుమ రాచి, హారతి కర్పూరపు తునకతో దానిమీఁద బీజాక్షరము లను యంత్రమును వేసి క్రిందనుంచి, యొకరొకరే వచ్చి దానిమీద జేయివైచి పొండని యాజ్ఞాపించెను. స్పష్టముగా గనఁబడుచున్న యా తెల్లకాగితము మీఁద నెల్లవారును చేతులు చేసి పోయు యేమి జరుగునో చూతమను వేడుకచేతఁ దమ స్థానముల గూరుచుండి చూచుచుండిరి. అందఱును ముట్టుకొని పోయిన తరువాత హరి శాస్త్రులాముక్కనుదీసి సాంబ్రాణిధూపము వేసి, హారతికర్పూరము వెలిగించి దానిమీఁద ఆ ముక్కను నాలుగయిదుసారులు మోపి రాజ శేఖరుఁడుగారి చేతికిచ్చెను. ఆయన చేతిలోఁ బుచ్చుకొని చూచునప్ప టికి దానిమీఁద పెద్ద యక్షరములతో 'చాకల సరడు" అని వ్రాసి యుండెను. ఆ కాగితము పయికెత్తగానే యెల్లవారికిని స్పష్టముగా వంకర యక్షరములు కనబడుచుండెను. దగ్గరనున్నవారిలోనొకరు దానిని పుచ్చుకొని చదువునప్పటికి చాకలిసర్వఁ డొకఁడు తప్ప మిగిలిన వా రందఱును నద్భుత ప్రమోదమగ్న మానసులయి చప్పటలుగొట్టి శాస్త్రుల శక్తిని ఉపాసనాబలమును వేయినోళ్ళం