పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవున కరుగుమీఁద బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికిఁ బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలను గూటిలోనున్న యద్దమును విభూతిపెట్టెను గొనివచ్చి దేవు నరుగు వద్దనున్న పీటదగ్గఱఁ బెట్టినది. తోడనే లోపలినుండి నలువది యేండ్లు దాఁటిన విధవ యొకతె పిడిచి కట్టుకొనిన తడిబట్ట చెఱఁగు నెత్తిమీఁది నుండి రానిచ్చి మునుఁగు వేసికొని, పొయిలోని బూడిద నొసటను బొట్టు పెట్టుకొని వెండిచెంబుల జోటితో మడినీళ్ళనుదెచ్చి పీట యొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుఁడుగారు స్నానముచేసి, జుట్టుతుడుచు కొని కొనలు ముడివైచుకొని, అప్ప డాఱవేపిన మడిబట్టను గట్టు కొని వచ్చి, దేవు నరుగుముందఱనున్న పీటమీఁద గూరుచుండి యాచమనము చేసి, విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్టమును కనిష్టకయుఁ దప్ప తక్కిన మూడువేళ్ళతోను నొసటను భుజములను కంఠమునను కడుపునను ఱొమ్మునను రేఖ లను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామ ములను పళ్ళెములోనిడి మంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో తక్కివారందఱును స్నానము చేసివచ్చి గోడల పొడుగునను పీటలమీఁద గూరుచుండిరి.

భోజనమునకు రావలసినవా రందఱును లోపలికి వెళ్ళిన తరు వాత మాణిక్యాంబ మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడకగదిలో కూరుచుండి తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలో వీధి తలుపు వద్ద "రాజశేఖరుడుగారూ" అని పిలుపుమీఁద పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినఁబడెను. 'వచ్చె వచ్చె'నని లోపలినుండి పలు కుచు మాణిక్యాంబ వచ్చులోపలనే, కేకలతో గూడ తలుపుమీఁద దబ దబ గుద్దులు వినఁబడెను. ఆమె వెళ్ళి తలుపు గడియ తీయునప్పటికి నుదుట దట్టముగాఁ బెట్టిన విభూతి చెమ్మటతోఁ గలిసి చప్పిడిదౌడ లకు వెల్లవేయఁ జెవులకుండలము లుయ్యాలలూగ ముడుతలు పడి యున్న ముసలి మొగమును అంగవస్త్రముతోఁ జేర్చి చుట్టిన బట్టల నందునుండి కనఁబడు తెల్లని జుట్టగల తలయును, లోపలి నీరు కావి