పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధోవతులపై నున్న దర్భాసనముచే లావుగాఁగనఁబడు కృష్ణాజినపచుట్ట గల మూపులను, వీపునుండి కుడిభుజముమీఁదుగా వచ్చిన కృష్ణాసనపు త్రాడుకొనను గట్టబడ్డ రాగిజారియును నారసంచియుఁ గల యెండు ఱొమ్మును గల నల్లని పొడుగయిన విగ్రహ మొకటి ద్వారబంధము పొడుగునను నిలువఁబడి యుండెను. తలుపుతీయఁగానే యా విగ్ర హము తిన్నగా పడమటింటి వైపునకు నడచి లోపల రాజశేఖరుఁడు గారికెదురుగా నిలవబడెను.

రాజ__శాస్త్రులుగారూ! మీదేయూరు ?

శాస్త్రి__మాది కానూరగ్రహారము. మాయింటిపేరు బులుసు వారు; నా పేరు పేరయ్యసోమయాజులు. మీకీర్తి జగద్విఖ్యాత మయినది. పదిమంది బ్రాహ్మణుల కింతయన్నము పెట్టినను సంభావన ఇచ్చి నను భూమిమీద సార్ధకజన్మము మీదికాని నా వంటి వ్యర్థుని బ్రతుకెందుకు?

రాజ__కార్తిక సోమవారము.మీరు రాత్రిదాక నుండెదరా?

సోమ__పెద్దవాఁడ నయినాను. ఇప్పుడుండలేను.

రాజ__సోమయాజులుగా రెండఁబడి నట్టున్నారు. అట్లయిన వేగిరము నూతి దగ్గఱ నాలుగుచేదలనీళ్ళు పోసికొని రండి.వడ్డన యవుచున్నది.

సోమ__మీ భోజనములుకానిండు. నాదొక్క మనవియున్నది. నాకు స్వహస్తపాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధిచేసి నాలుగు వస్తువులను అమర్చిన యెడల స్నానముచేసి వచ్చి పాకము చేసికొనెదను.

రాజ__వేఱేపొయ్యిలేదు. మీరు దయచేసి మా పాకములోనికే రావలయును.

సోమ__నాకు స్త్రీపాకము పుచ్చుకోనని నియమము.మీయింట వంటచేయువారు పురుషులేకదా ?

రాజ__మా పినతల్లి కుమార్తె వంట చేసినది. మా యింట నెప్పడును స్త్రీలే వంటచేయుదురు.