పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిచ్చి, మరల దన ప్రభువుగారి యొద్దకు పోఁగోరఁగా రాజశేఖ రుఁడుగా రాయనను బహువిధముల బ్రతిమాలుకొని కొమారుని యొక్కయు కొమార్తె యొక్కయు వివాహములు జరుగువరకు నిలుచు నట్లొడబఱిచిరి. రాజశేఖరుఁడుగారు మరల గ్రామమునకు వచ్చి మాన్యములు వదలించుకొని ధనికులయి యున్నారన్నవార్త విన్న తోడనే బీదతనము వచ్చినప్పుడు మొగముచాటు వేసిన పూర్వపు స్నేహితులందఱును పెల్లగిలి రాసాగిరి. మున్నుపిలిచినను పలుకని యాశ్రితకోటిలోని వారందఱును దినమును కారుపర్యాయము లింటి చుట్టును దిరుగ నారంభించిరి; తొల్లి చూడమనసయినను గనబడని భృత్యవర్గము జీతబత్తెములులేకయే సదా గుమ్మమువద్ద నిలువఁ జొచ్చెను. రామశాస్త్రియు సిద్ధాంతియు వచ్చి ముఖస్తుతులయందుఁ దమకుఁగల పాండిత్య ప్రకర్షమును మునుపటికంటె ద్విగుణముగా బ్రకటించుచు వచ్చిరిగాని, తమ విద్యాసారస్యమును గ్రహించి యక్షర లక్షలిచ్చెడి మునుపటి యౌదార్యమును రసికత్వమును రాజ శేఖరుఁడుగారియం దప్పడున్నట్లు వారికి కనఁబడలేదు. వారిలో సిద్ధాంతి తనమీఁద రాజశేఖరుఁడుగారికి కోపమువచ్చినదేమో యను కొని తదనుగ్రహమును మరలఁ బడయఁగోరి, నారాయణమూర్తి తన యొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క నగలపెట్టె నొక కూలివాని చేత మోపించుకొనివచ్చి రాజశేఖరుఁడుగారి కొప్పగించెను; మఱియు రాజశేఖరుఁడుగారికిఁ దెలియవలయు నని బంధువుల ముందరను మిత్రులముందరను ఆయనను కొనియాడఁజొచ్చెను; సుబ్రహ్మణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే యిప్పుడు మరల మారకదశ తొలగిపోయినది, కాబట్టి దానియంతటి దివ్యజాతకము లోకములో మఱియొకటి లేదని పొగడ దొడంగెను. ఆ సంగతి తెలిసికొని బీద తనము వచ్చినప్పుడు పిల్లనియ్యమన్నవారే యిప్పుడేలాగుననైన దమ కన్యలను సుబ్రహ్మణ్యమునకుఁ జేసికొండనియు, నాలుగు వందల రూపాయలు వరదక్షిణ యిచ్చెదమనియు రాజశేఖరుడుగారి చుట్టును దిరిగి యనుసరింప మొదలుపెట్టిరి. వారు భాగ్యవంతులను