పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/212

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లునకు కానుకలను కట్నములను పెట్టువారును అయినను, వారి పిల్లల నెవ్వరిని జేసికోక రాజశేఖరుఁడుగారు కొమారునకు సూర్య నారాయణగారి కొమార్తె మహాలక్ష్మినిఁ జేసికొనుటకే నిశ్చయించిరి.

తరువాత నొక శుభముహూర్తమున ముందుగా రాజశేఖరుఁడు గారు కుమారుని వివాహము చేసిరి; బోగమేళము లేకపోయినయెడల వివాహము శోభగాంచదని యెందఱు చెప్పినను, వారి మాటల నాద రింపక పాతివ్రత్యమును బోధింపఁదగిన యుత్తమదినములలో లంజల తోడిపొత్తు కూడదని భోగస్త్రీల పాటలకై విశేషధనమును వ్యయ పెట్టక, యల్పధనముతో గాయక శిఖామణులచేత కర్ణరసాయనముగా హరికీర్తనలు పాడించిరి. సదస్యమునాఁడు సంభావన సమయమున నపాత్రదానమున కొప్పుకొనక యోగ్యులును పండితులునగు కొందఱినే యథాశక్తిని సత్కరింపనెంచి, వచ్చిన బ్రాహ్మణుల కందఱికిని సంభావన యియ్యకపోయిన సభవారిలోఁ దలవంపుగా నుండునవి చెప్పవచ్చిన బంధువులతో వివాహాది దినములలోఁ దలయెత్తుకొని దిరిగి యప్పులపాలై తరువాత నెల్లకాలమును దలవంచుకొని తిరుగుటకంటె నీయైదు దినములను తలవంచుకొని యావలఁ దలయెత్తు కొని తిరుగుటయే మంచిదని చెప్పి తమ యిష్టప్రకారమే జరిగించిరి; వీధులుగట్టి సత్రములు వేయుట వృధావ్యయమని బంధువులు మిత్రులు నైనవారిని మాత్రమే భోజనమునకుఁ బిలిచి యాదరించిరి; ఈ ప్రకారముగాఁ జేయుటచేత మొదట నుద్దేశించుకొన్న దానికంటెను వెచ్చము తక్కువ పడినందున, మిగిలిన యాధనము పెట్టి కోడలి కాభరణములు చేయించిపెట్టిరి.

కొమారుని వివాహమైన మూడవదినముననే సీతను మేనల్లుఁడైన శంకరయ్యకిచ్చి రాజశేఖరుడుగారు పెండ్లి చేసిరి. ఈ వివాహమును సమస్త విషయములయందును ముందుగా జరిగిన వివాహమునే పోలియున్నది. ఈ రెండు వివాహములయందును బూజము బంతులు మొదలగు దురాచారములను మోటుతనముగా నుండు వేడుకలును నాకబలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లు కొనుచు స్త్రీలుఁబురుషులునను భేదమును పాటింపక విచ్చలవిడిగా