పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 సూర్య__మీ యింటి కీనడుమ సుబ్బరాయఁ డనుచిన్నవాఁడు వచ్చినాఁడు అతఁ డెక్కడనున్నాడు?

రాజ__ఆపేరుగల చిన్నవాఁడెవ్వఁడును మాయింటికి రాలేదు.

సూర్య__మీ కొమార్తెను దొంగ లెత్తుకొనిపోయినప్పుడు మా గ్రామమునుండి తీసికొని వచ్చినాఁడు. అతఁడు వేంకటేశ్వరుల మ్రొక్కును బట్టి తల పెంచుకొన్నాఁడు; మిక్కిలి చక్కనివాఁడు;ఒక రాజుతోడఁ గూడ బయలుదేఱి మీయింటికి వచ్చెదనని మాతోఁ జెప్పి నాడు: చిన్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాడట!

రాజ__అతనితో మీకేమి పని యున్నది?

సూర్య__మా యింటియొద్ద గొన్నిదినములున్నాఁడు; అతని రూపగుణసంపదను జూచి యతనికి నాకొమార్తె నిచ్చి వివాహముచేసి, నాకు పుత్రసంతానము లేదు గనుక అతని నిల్లఱిక ముంచుకోవలెనని నిశ్చయించుకొన్నాము.

అనిన తరువాత రాజశేఖరుఁడుగారు రుక్మిణి సుబ్బరాయఁడను పేరున పురుషవేషము వేసికొనియుండుట లోనుగాఁగల వృత్తాంతము నంతను వినిపించి, యాచిన్నదానిని తన కుమారుడైన సుబ్రహ్మణ్యమునకు జేసికొనియెదని వాగ్దానము చేసిరి. అంతట సూర్యనారాయణ గారు పెన్నిధి దొరికిన పేదవానివలె పరమానంద భరితుడై రాజశేఖరుడుగారియొద్ద సెలవు పుచ్చుకొని వెంటనే తన గ్రామమునకుఁ బోయి భార్యను కుమార్తెను వెంటబెట్టుకొని మఱునాఁడు మధ్యాహ్న మునకు మరలవచ్చెను. ఆ దినముననే రాజశేఖరుఁడుగారు చల్లపాటు వేళ బండ్లుచేసికొని సకుటుంబముగా బయలుదేరి, రెండుమూడు దిన ములలో సూర్యనారాయణ గారితోఁ గూడ రాజమహేంద్రవరముచేరి, ఆక్కడ రామమూర్తిగారి లోపల రెండు దినములుండి, వారికడ దాచిన పాత్రసామగ్రిని దీసికొని వారినిగూడ వివాహమునకై వెంటఁ బెట్టుకొని సుఖముగాఁ బోయి ధవళేశ్వరము ప్రవేశించిరి.

పెద్దాపురమునుండి వచ్చిన కృష్ణజగపతి మహారాజుగారి సభికుఁడు రాజశేఖరుఁడుగారికి మాన్యములను గృహమును విడిపించి