పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకుం బోవుచుండిరి; అప్పడు కాయ శరీరముగల యొక పెద్ద మనుష్యుఁడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలోఁ గాళ్ళును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొనివచ్చి, ధర్మశాల మీఁద నొడ్డున గూర్చుండి. వచ్చునప్పడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మ పుడకతో దంత ధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరము లుండును: మొగము మీఁద స్ఫోటకపు మచ్చలే లేకపోయె నేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱు యుండదు; అట్లని, యాముఖ మాయనను నిత్యమును దర్శింపవచ్చు ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్రనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టి గాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుఁ డని తోపఁజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరు కావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టఁబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడి యున్నది; చెవుల నున్న రవలయంటుజోడును, కర్మిష్టుఁ డనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక యందలి బంగారపు దర్భముడి యుంగరమును తర్జని యందలి వెండి బటువులు రెండునుదప్ప శరీరమున నాభర ణము లేవియలేవు; ఆయన పేరు రాజశేఖరుఁడు; ఆయన ముఖ ప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి ఆయన వారి వారి తారతమ్యముల కర్హముగాఁ దగిన మర్యాదలు చేసి కూర్చుండుఁడని చేయిచూప, "చిత్తము" 'చిత్తము" "మీరు దయచేయండి" అనుచుఁ జావడినిండఁ గిటకిట లాడుచుఁ గూరుచుండిరి.

అప్పుడు రాజశేఖరుఁడుగారు 'సిద్ధాంతిగారూ! మీరు నాలుగు దినములనుండి బొత్తిగా దర్శన మిచ్చుట మానివేసినారు. మీ యింటఁ బిన్న పెద్ద లందఱును మఱేమియు లేకుండ సుఖముగా నున్నారు గదా?"

19