పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కొండకు దక్షిణమునకు తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించి యున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుంగూడఁ గలిగియుండెను. కాని యిప్పడిప్పడు గ్రామ మును ధవళేశ్వర మని వ్యవహరించుచున్నారు. కొండమీఁది నుండి సోపానములు దిగి వచ్చినతోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయ మొక్కటి లోచన గోచరం బగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణఁచి దక్షిణాభి ముఖుఁడయి చనుచు అగస్త్యుఁడాస్వామిని అచట ప్రతిష్టచేసెనని స్థల పురాణము చెప్పచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాల మయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్ళతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీప మున వీధికిఁ దూర్పు ప్రక్కను "ధర్మచావడి" అని యొకటి యుండెను. అది పరదేశబ్రాహ్మణులను మార్గస్థులను రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమం దది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్ద మనుష్యులు ప్రతిదినమును ఉదయా స్తమయ సమయములయందు ప్రోగై యిష్టకథా గోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగ పడుచుండెను.

ఒకానొక దినమున సూర్యుఁ డుదయించి ప్రాచీముఖంబునఁ గుంకుమబొట్టచందంబు వహించి వృక్షాగ్రములను బంగారు నీరు పూసినట్టు ప్రకాశింపఁజేయుచుండెను; చెట్ల మీఁది గూళ్ళనుండి కల కల ధ్వనులతో వెలువడి పక్షులు నానా ముఖముల ఎర కయి వెడలు చుండెను: పసులకాపరి బాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక 'వెల్లావు కడి నాది' 'దోరగేదె కడి నాది"యని గంపలు చేతఁబట్టకొని, పడుచు లొండొరుల మీఱి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలులు భుజముల మీఁదఁ బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలము