పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముచ్చటగా నుండు పలువిధముల వచ్చని పయిరులను, ఆ పయిని వృక్షములమీఁదను గూర్చుండి కర్ణ రసాయనముగా బిల్లన గ్రోవిని మోవినిబూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరఁగి మేపులు చాలించి కేపల తోడఁగూడఁ జెవులు నిక్కించి యఱ్ఱులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ళయందు నిలుచున్న పశుగణములను, పడమటను నీలముల వలెనున్న తేఁట నీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపు తళుకులను బుట్టింపఁ బలుతెఱంగుల జలవిహంగంబులు పట్టచెండ్ల వలె మీలఁ బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచుఁ బ్రవాహంబు తోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సవము చేయు చుండును.

ఆ పర్వతపాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్ల రాతి బండమీఁదఁ జక్కఁగా మలఁచిన రామ పాదములు వెలసి యున్నవి. శ్రీరాములవారు పూర్వకాలమున సీతా లక్ష్మణులతోడఁ గూడఁ బర్ణశాలకుఁ బోవుచు త్రోవలో ఈ పర్వత సమీపమున నడచిన నాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్మదురు. కాబట్టి యా రామ పాదములను సందర్శింపవలెనను నభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీఁది కెక్కి శ్రీ జనార్ధనస్వామివారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుటం జేసి జాతిమతభేదములేక యెల్లవారును పులియోగిరము దధ్యోదనము మొదలుగాఁ గల స్వామి ప్రసాదమును స్వీకరించి కన్నుల కద్దుకొని యచ్చటనే యారగించి చేతుల నంటుకొన్నదానిని కడుగుకొన్న నప చార మగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును గోడలకును వర్ణము వేయుటయే కాక తచ్ఛేషముతోఁ దమమీఁజేతులకును బట్టలకును మెఱుఁగు పెట్టు కొనుచుందురు.

17