పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆతఁడు నా స్థితిని విని మిక్కిలి విచారపడి, సొమ్ము చేతనుంచిన యెడల పాడుచేయుదునని యెఱిగి యొక స్నేహితునకు జాబువ్రాసి నన్నచ్చటికిఁ బంపెను. నేనా యుత్తరమును దీసికొనిపోయి చూచిన తోడనే యాతఁడు నన్ను మధ్యాహ్నమున రమ్మనిచెప్పి నాకు నెలకు పది రూపాయల జీతముగల పని నొకదాని నిచ్చెను. నేనా పనిలో రెండు మాసములుండువరకు నాకది యెంతో భారముగా కనబడెను. ఒంటిగా నున్నప్పుడు నా కంటఁబడిన వస్తువుల నెల్లను హస్తలాఘవమును జూపి నేను మాయముచేయుచు వచ్చినందున, నా యజమానుఁడు వారిమీఁదను పెట్టి వీరిమీదను పెట్టి నన్ను దిట్టుచుండెను. అంతియకాక యొకరికిఁ లోఁబడియుండి వారు చెప్పినట్లెల్ల పని పాటలు చేయుట నా స్వభావమునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజు వలె నుండవలెనని యాశ గనుక, ఆ పనిని విడిచి పెట్టివచ్చి యింటివద్ద కాలిమీఁద కాలువేసుకొని కూరుచుండి నన్ను నమ్మినవారికడ నెల్లను ఋణములు చేయుచు, అప్పుపుట్టి నంతకాలము సులభముగా జీవనము చేయుచుంటిని. ఈ ప్రకారముగా నిరుద్యోగముగా జీవనము చేయుచున్న కాలములో నేనితరులుచేయు హిత బోధ నెప్పుడును వినకపోయినను, అడుగుట యందు మాత్రము విశేష శ్రద్దపుచ్చుకొని విశేష నీతి వాక్యములను నేర్చుకొంటిని. అటు తరువాత నా నీతి వాక్యములు నాకేమియుఁ బనికి రాకపోయి నను, ఇతరులకైనఁ బనికి వచ్చునని యెంచి మూఢులకు హితోపదేశములుచేసి గొప్పవాఁడ నని పేరుపడి ధనమార్జింప నారంభించితిని. అప్పుడు సహితము నా నడత తిన్నగా నుండనందున నొక నాఁడొక భక్తుఁడువచ్చి 'మీరిన్ని నీతులను జెప్పుచున్నారు గాని మీ ప్రవర్తనము తిన్నగా నున్నదా?' యని నన్ను బ్రశ్నచేసెను. 'నాకుఁ బనికి రావనియే కదా యీ నీతులన్నిటిని మీకు వదలివేయు చున్నాను; నాకే పనికివచ్చిన యెడల నొక్క వాక్యమయిన నా కుక్షిలో