పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆతఁడు తానుగూడ పాలికుండెదనని చెప్పి రెండువందల రూపాయ లను నా చేతికిచ్చి నేను పనిచేయుటకును తాను వడ్డి పుచ్చుకొన కుండుటకును, వచ్చిన లాభములో చెఱిసగము చూచుకొనుటకును నన్నొడబఱిచి పంపెను. మాకు వచ్చిన లాభము స్వల్పమే యైనను పనిచేయువాఁడను గనుక నా కెక్కువ లాభము కావలెనని నేను నా మిత్రునితో కలహము పెట్టుకొన జొచ్చితిని. రాజు లనుభవించుటకు రాజ్యములున్నను, ఒకరితో నొకరు పోట్లాడి చత్తురు; సన్యాసులకు కౌపీనము కంటె నధిక మేమియు లేకపోయినను పోరులేక సంతుష్టి పొంది యందురు. దైవము దయచేసినదానితోఁ దృప్తి పొందియున్న నేకలహములను గలుగవు.తృప్తిలేక యాశాపిశాచముచే నావ హింపబడినచో నెల్ల కలహములను గలుగును. ఆయినను నా స్నేహితుఁడు మిక్కిలి మంచివాఁడును ఉదార సాహసము కల వాఁడును గనుక, ఒకనాఁడు నన్ను తన దగ్గఱకుఁ బిలిచి యిట్లనియెను:

"నీవు మొదటినుండియు వర్తకుఁడవుగా నున్నావు గనుక నీకు సొమ్మునందే యిష్టము; నాకు విద్యాధనమునందు మాత్ర మిష్టము. త్యాగభోగముల కక్కఱకు రాకపోయినను ధనమునుజూచు కొనుచున్నను నీకు సంతోషము కలుగును. నాకు గౌరవముతో జరుగుట కున్నంజాలును. కాబట్టి యీ రెండువందల రూపాయలను నీవు పుచ్చుకొమ్ము."

అని యాతఁడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచి పెట్టెను. ఆ సొమ్ము చేతికందిన సంతోషముచేత, మఱింత యుల్లాసముతో దుకాణము కట్టిపెట్టి రాత్రియు పగలునుగూడ జూదమాడ సాగించి కొన్ని మాసములలో సొమ్మంతయుఁ బోగొట్టుకుని జోగి నైతిని. తరువాత పశ్చాత్తాపపడి, తిండికి సహితము జరగక యిబ్బందిపడుచు నొకనాడు మాసికలు వేసిన బట్టలతో స్నేహితుని యొద్దకుఁ బోయి యాతఁడు చేపిన యుపకారమును బహువిధముల గొనియాడి నాకు సంభవించిన దురవస్థ యంతయుఁ జెప్పుకొంటిని.