పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి పైకి రానిత్తునా?' యని సమయోచితముగా బ్రత్యుత్త రమునిచ్చి, యిఁక నందు నిలుచుట కార్యము కాదనుకొని శ్రీఘముగా మా గ్రామము వదలివేసి దేశాంతరమునకుఁ బోవలెనని బయలు దేఱితిని. అట్లు బయలుదేఱి గ్రామైకరాత్రముగా శయనించుచు భోజనము చేసినయూరఁ బరుండక నిత్యప్రయాణములు చేయుచు, ఒకనాఁ డొక గ్రామముపఱగడ గొప్ప మేఁకల మంద నొక దానిని జూచి ఇన్ని మేకలను వాఁడెట్ల కాపాడఁగలఁడాయని గొల్లవానియందు మిక్కిలి కనికరము తోఁచి కొంతభారము తగ్గించినను తగ్గించుటయే యని రెండు మేకపిల్లలను బుజము మీఁద వేసికొని నడవ నారంభించితిని; అప్పుడు వాని వెంటనే తల్లియు నఱచుచు రాసాగెను; అది చూచి తల్లి బిడ్డ లనెడఁబాపిన పాపము వచ్చునని కొంత భూతదయ గలవాఁడనై యా పిల్లల తల్లి నిగూడఁ దోచుకొని పోవుచుంటిని. ఆ సంగతి నేలాగుననో కనిపెట్టి గొల్లవాఁడు నా వెనుక 'దొంగా! ఆగు' మని కేకలు వేయుచు నడచి వచ్చుచుండెను. అదివరకు పయి గ్రామము నెంత ప్రొద్దెక్కి చేరుదునోయని భయ పడుచుంటిని గాని, వాని కేక లతో నిమిషములో నూరు చేరి సంతోషించి తిరిగి చూచితిని: వాడు నా పరుగు కలిసికోలేక తక్కిన మేకల నెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుక మరలి పోయెను. నేనా మేకను పిల్లలను పొరుగూరిలో విక్రయించి యా సొమ్ము దారిబత్తెమున కుంచుకొని, కొన్ని దినములలో కొండవీడు చేరి యచట యోగినై యుండి, నా యొద్ద సీతారామ యంత్రమున్నదనియు దానిని జూచిన వానికి సమస్త సంపదలు గలుగుననియుఁ జెప్పి, యొక బొమ్మరాతిని గదిలోనుంచి రహస్యముగా డబ్బు డబ్బు చొప్పునఁ బుచ్చుకొని చూప నారంభించితిని. ఏ పాడు వస్తువు నయిననుసరే రహస్య ముగా నుంచుటవలన దానియందు గౌరవము హెచ్చును. దివ్య క్షేత్రమల యందలి దేవాలయములలోని విగ్రహములను పామరులు పూజారులకు దక్షిణలిచ్చి స్వామి యెంత బాగుండునో యని చూచు